
హిమాలయ దేశం నేపాల్ లో రాజుకున్న కార్చిచ్చు చల్లారడం లేదు. జనరేషన్ జడ్ ఉద్యమకారులు ఎక్కడా తగ్గకుండా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దేశ ప్రధాని, మంత్రులు రాజీనామా చేసినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దేశంలో సంస్కరణలు తెచ్చేవరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. అందుకోసం లేటెస్ట్ గా తమ డిమాండ్లను మరోసారి విడుదల చేశారు. గత ముప్పై ఏళ్లుగా దేశాన్ని దోపిడీ చేశారని ఆరోపిస్తూ పరిపాలన, దర్యాప్తు సంస్థల్లో మార్పు రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఉద్యమం ఏ ఒక్కరి వ్యక్తిగతం కాదని.. దేశ భవిష్యత్తును మార్చేందుకు యువతరం తీసుకున్న కఠినమైన నిర్ణయం అని ఉద్యమకారులు ప్రకటించారు. దేశంలో శాంతి స్థాపన అవసరమే కానీ.. అది దేశ రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన తర్వాతే సాధ్యమవుతుందని ప్రకటించారు. నేపాల్ ప్రసిడెంట్, ఆర్మీకి తమ డిమాండ్లేంటో ప్రకటించారు.
ఉద్యమకారుల డిమాండ్లు:
- వెంటనే ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
- పౌరులు, మేధావులు, యువకుల అభిప్రాయాల మేరకు రాజ్యాంగాన్ని మార్చాలి
- మధ్యంతర ప్రభుత్వం పూర్తైన వెంటనే స్వంతంత్ర్యంగా ఎన్నికలు నిర్వహించాలి.
- ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకత్వంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి
- గత 30 ఏళ్లుగా దోచుకున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- నిస్పక్షపాతంగా అవినీతిపై దర్యాప్తు జరిపి ఆస్తులను జప్తు చేయాలి
- విద్య, ఆరోగ్యం, న్యాయ, రక్షణ, కమ్యూనికేషన్ అనే ఐదు ప్రాథమిక రంగాలలో సంస్కరణలు తీసుకురావాలి.
ఉద్యమం పేరుతో దోపిడీకి కుట్ర.. కర్ఫ్యూ విధిస్తున్నాం: నేపాల్ ఆర్మీ ప్రకటన:
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయడంతో ప్రభుత్వా్ని హస్తగతం చేసుకున్నట్లు నేపాల్ ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం నడుస్తుందని లేటెస్ట్ గా పేర్కొంది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఉద్యమం పేరున దాడులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, దోపిడీకి పాల్పడటం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక నుంచి ఆర్మీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతుందని నేపాల్ ఆర్మీ చీఫ్ జనలర్ అశోక్ రాజ్ సిగ్దేల్ వెల్లడించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉద్యమకారులతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు నిరసనలు ఆపి.. చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను కాపాడటంతో పాటు సామాన్య ప్రజల సంక్షేమం తమ బాధ్యత మంగళవారం (సెప్టెంబర్ 09) అని అన్నారు.
నేపాల్లో హింసాత్మక ఘటనల దృష్ట్యా రంగంలోకి దిగిన సైన్యం.. రాజధాని ఖాట్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ విధించింది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా గస్తీ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. ఖాట్మండు, భక్తపూర్, లలిత్పూర్ సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.
హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించిన ఆర్మీ చీఫ్.. ఉద్యమం వెనుక కొన్ని శక్తులు పెద్ద దోపిడీకి ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆస్తులను డ్యామేజ్ చేయడం, సామాన్యులను ఇబ్బంది కలిగించడం చేస్తున్నారని.. ఇలాంటి చర్యలను ఆర్మీ క్షమించదని.. ఈ విధ్వంసాన్ని ఆపకుంటే అణచివేస్తామని హెచ్చరించారు.
నేపాల్ లో సంస్కరణలు రావాలని.. దోపిడీ అంతం కావాలని జనరేషన్ జడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా బ్యాన్తో ఉధృతంగా మారిన జెన్-జెడ్ అల్లర్లు పల్లె నుంచి పార్లమెంటు వరకు వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆస్తులు ధ్వంసం అయ్యాయి. 19 మంది మృతి చెందారు.
హై అలర్ట్ ప్రకటించిన భారత్.. సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన తెలంగాణ:
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించింది భారత ప్రభుత్వం. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం భారత్ చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అక్కడున్న తమ పౌరుల కోసం ఢిల్లీ తెలంగాణ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముగ్గుర అధికారుల బృందాలకి బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.