రూ.2,350 కోట్ల జీఎస్​టీ ఎగవేత.. 15 ఇన్సూరెన్స్ కంపెనీల ఘనత

రూ.2,350 కోట్ల జీఎస్​టీ ఎగవేత..  15 ఇన్సూరెన్స్ కంపెనీల ఘనత

బిజినెస్​ డెస్క్​, వెలుగు: బజాజ్​ అలయన్జ్​,  సన్​లైఫ్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ సహా 15 ఇన్సూరెన్స్​ కంపెనీలు ఏకంగా రూ. 2,350 కోట్ల జీఎస్​టీ ఎగ్గొట్టినట్లు బయటపడింది. జీఎస్​టీ ఎగవేతపై  ఈ 15  ఇన్సూరెన్స్​ కంపెనీలకు షోకాజ్​ నోటీసులు పంపించారు. జీఎస్​టీ ఎగవేతకు పాల్పడిన 15 ఇన్సూరెన్స్​ కంపెనీలపై దర్యాప్తు పూర్తయిందని ఒక సీనియర్​ గవర్నమెంట్​ ఆఫీసర్​ వెల్లడించారు. జీఎస్​టీ ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్​ కంపెనీల జాబితాలో కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఉన్నాయి. 

బడా ఇన్సూరెన్స్​ కంపెనీలు..

జీఎస్​టీ ఎగ్గొట్టిన 15 ఇన్సూరెన్స్​ కంపెనీలపై దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. వీటిలో  కొన్ని  మ్యూచువల్ ​ ఫండ్స్​ , బ్యాంకులు కూడా ఉన్నాయి. జీఎస్​టీ ఎగవేత రూ. 2,350 కోట్ల దాకా ఉంటుందని గుర్తించగా, ఇప్పటికే రూ. 700 కోట్లను జీఎస్​టీ అధికారులు రికవర్​ చేశారు. బజాజ్​ అలయన్జ్​, సన్​లైఫ్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్సూరెన్స్​ వంటి బడా ఇన్సూరెన్స్​ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. 

ఎగవేత ఈ విధంగా..

గూడ్స్​, సర్వీసుల సప్లయ్​ లేకుండానే పై 15 లైఫ్​ ఇన్సూరెన్స్ ​కంపెనీలు, 15 జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు  ఫేక్​ ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్ తీసుకోవడంపై జీఎస్​టీ అధికారులు దర్యాప్తును నిర్వహించారు. ఈ లిస్టులో ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్​ కంపెనీలూ చోటు చేసుకోవడం గమనించదగ్గది. ఈ జాబితాలోని 30 కంపెనీలలో 15 ఇన్సూరెన్స్​ కంపెనీలపై దర్యాప్తును అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని ఇన్సూరెన్స్​ కంపెనీలపైనా దర్యాప్తు కొనసాగుతుందని సీనియర్​ ఆఫీసర్ పేర్కొన్నారు. కొన్ని కంపెనీలకు ఇప్పటికే షోకాజ్​ నోటీసులు జారీ కాగా, మరి కొన్ని కంపెనీలకు త్వరలో షోకాజ్​ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. మిగిలిన 15 ఇన్సూరెన్స్​ కంపెనీలపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. 

అసలు సమస్య ఏంటి?

ఇన్సూరెన్స్​ కంపెనీలతో జీఎస్​టీ సమస్య ఎలా వచ్చిందో ఇప్పడు తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజంట్లకు కమీషన్​ చెల్లిస్తాయి. ఇది సాధారణమే. కానీ, ఎలాంటి సప్లయ్ లేకుండా అదనపు కమీషన్​ను ఏజంట్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించాయి. ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఎక్కువ బిజినెస్​ను తెస్తారనే ఉద్దేశంతో ఏజంట్లకు అధిక కమీషన్​ను ఇన్సూరెన్స్​ కంపెనీలు చెల్లిస్తున్నాయి. దీంతో అలాంటి ట్రాన్సాక్షన్లపై పొందిన ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ రికవర్​ చేసేందుకు జీఎస్​టీ అధికారులు కేసులు బుక్ చేశారు. కానీ, అక్కడ అసలు ఎలాంటి సప్లయ్​  చోటు చేసుకోలేదనేది గమనించాలి.

ఐఆర్​డీఏ దృష్టికీ..

ఇన్సూరెన్స్​ కంపెనీలు జీఎస్​టీ ఎగవేతకు పాల్పడిన విషయాన్ని ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ డెవలప్​మెంట్​ అథారిటీ (ఐఆర్​డీఏఐ) దృష్టికి జీఎస్​టీ అధికారులు తీసుకెళ్లారు. ఏజంట్లకు చెల్లించే కమీషన్​పై విడిగా అంతకు ముందున్న పరిమితిని ఐఆర్​డీఏఐ తొలగించింది. ఇన్సూరెన్స్​ కంపెనీలకు వాటి మొత్తం ఖర్చులపైనే సీలింగ్​ పెట్టింది. జీఎస్​టీ ఎగవేతపై హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, సన్​లైఫ్​, బజాజ్​ అలయన్జ్​, ఫైనాన్స్​ మినిస్ట్రీలకు పంపిన ప్రశ్నలకు సమాధానం రాలేదు.

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ..

డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్​ జీఎస్​టీ ఇంటెలిజెన్స్​, ముంబై జోనల్​ యూనిట్​ నుంచి నోటీసు వచ్చినట్లు జూన్​ 23 నాడు హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్సూరెన్స్​ స్టాక్​ ఎక్స్చేంజీలకు తెలిపింది. 2017–2022 మధ్య కాలానికి రూ. 942.18 కోట్ల జీఎస్​టీ రికవరీ ఎందుకు చేయకూడదో చెప్పమని జీఎస్​టీ అధికారులు కోరుతూ ఆ షోకాజ్​ నోటీసు జారీ చేసినట్లు ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇన్​పుట్​ ట్యాక్స్​ క్లెయిమ్స్​కు సంబంధించి పై నోటీసు జారీ అయినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ పరిశ్రమలోని అన్ని కంపెనీలకు ఈ ఇష్యూ  సంబంధించినదని చెబుతూ, తగిన చర్యలను తీసుకోనున్నట్లు స్టాక్​ ఎక్స్చేంజీలకు హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ తెలిపింది. జీఎస్​టీ అధికారుల ఉత్తర్వులను సవాలు చేయనున్నామని, అయినా ప్రొటెస్ట్​ కింద రూ. 250 కోట్లను జమ చేశామని ఆ కంపెనీ వివరించింది.