వినేష్ ఫోగట్, భజరంగ్ ఫూనియాకు మోడీ అభినందనలు

వినేష్ ఫోగట్, భజరంగ్ ఫూనియాకు మోడీ అభినందనలు

భారత కుస్తీ వీరుడు భజరంగ్ పూనియా అదరగొట్టాడు.  వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో  కాంస్య ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు.సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జ‌రుగుతున్న టోర్నీలో భజరంగ్ 65 కేజీలో విభాగంలో బ్రౌంజ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు.  దీంతో వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో నాలుగు సార్లు మెడ‌ల్స్ గెలిచిన ఫస్ట్ రెజ్లర్గా  రికార్డు సృష్టించాడు. 

ఇది మూడో బ్రౌంజ్ మెడల్..
కాంస్య పతక పోరులో భజరంగ్ పూనియా..ప్యూర్టోరికోకు చెందిన సెబాస్లియ‌న్ సీ రివెరాపై 11–9 స్కోరు తేడాతో గెలుపొందాడు.  అంతకుముందు క్వార్టర్స్ లో అమెరికాకు చెందిన జాన్ మైఖేల్ డ‌యాకోమిహాలిస్ చేతిలో భ‌జ‌రంగ్‌ ఓడిపోయాడు. అయితే రెపిచేజ్ రౌండ్‌లో ఆర్మేనియాకు చెందిన వాజెన్‌ను 7–6 పాయింట్ల తేడాతో ఓడించి బ్రాంచ్ మెడ‌ల్ మ్యాచ్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇక వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భ‌జ‌రంగ్  బ్రౌంజ్ మెడల్ సాధించడం ఇది మూడోసారి. అతను  2013, 2019లోనూ ..క్యాంస పతకాలను గెలుచుకున్నాడు. ఇక 2018లో  రజత పతకం సాధించాడు. 

వినేశ్‌‌ ఫొగట్‌కు కాంస్యం...
వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ ఛాంపియన్‌‌షిప్‌‌లో  వినేశ్‌‌ ఫొగట్‌ సత్తా చాటింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌ 53 కేజీ బ్రాంజ్‌‌ ప్లే ఆఫ్‌‌ బౌట్‌‌లో వినేశ్‌‌ 8–0తో జొన్నా మాల్‌‌మెగ్రెన్‌‌ (స్వీడన్‌‌)పై గెలిచింది. దీంతో వరల్డ్‌‌ ఛాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా తరఫున రెండు పతకాలు సాధించిన తొలి విమెన్‌‌ రెజ్లర్‌‌గా రికార్డు సృష్టించింది. 2019లోనూ వినేశ్‌‌ బ్రాంజ్‌‌ను గెలుచుకుంది. ఓపెనింగ్‌‌ బౌట్‌‌లో ఓటమి ఎదురైనా.. తన ప్రత్యర్థి బక్తుయన్‌‌ ఫైనల్స్‌‌కు వెళ్లడంతో వినేశ్‌‌కు రెప్‌‌చేజ్‌‌ ఆడే ఛాన్స్‌‌ వచ్చింది. ఈ రౌండ్లో వినేశ్‌‌ 4–0తో జుల్డాజ్‌‌ ఎషిమోవా (కజకిస్తాన్‌‌)పై, తర్వాతి బౌట్‌‌లో లేలా గుర్బనోవా (అజర్‌‌బైజా)పై గెలిచి బ్రాంజ్‌‌ ప్లే ఆఫ్స్‌‌కు అర్హత సాధించింది. విమెన్స్‌‌ 57 కేజీ బౌట్‌‌లో సరితా మోరె 4–2తో హన్నా టేలర్‌‌ (కెనడా)పై గెలిచినా, తర్వాతి రౌండ్‌‌లో 0–7తో అన్హెలినా లైసర్‌‌ (పోలెండ్‌‌) చేతిలో ఓడింది. 59 కేజీ క్వార్టర్‌‌ఫైనల్లో మాన్షి అహ్లవత్‌‌ 3–5తో జొవితా మరియా వ్రెజిసెన్‌‌ (పోలెండ్‌‌) చేతిలో పరాజయంపాలైంది. 68 కేజీ సెమీస్‌‌లో నిషా దహియా 4–5తో అమి ఇషీ (జపాన్‌‌) చేతిలో కంగుతిన్నది. 

మోడీ శుభాకాంక్షలు..
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో కాంస్య పతకాలు గెలుచుకున్న భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ లను ప్రధాని మోడీ అభినందించారు. ఇద్దరు రెజ్లర్లు దేశానికి గర్వకారణమని కొనియాడారు.  ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో రెండు పతకాలు గెలుచుకున్న మొదటి భారత రెజ్లర్ గా  వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించిందని మెచ్చుకున్నారు. అలాగే భజరంగ్ నాలుగు పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.