IPL 2026: కొత్త స్టాఫ్‌తో కోల్‌కతా కళకళ.. బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ పేసర్

IPL 2026: కొత్త స్టాఫ్‌తో కోల్‌కతా కళకళ.. బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ పేసర్

2026 ఐపీఎల్ సీజన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ సిబ్బందిలో ఖాళీగా ఉన్న స్థానాలను నెమ్మదిగా భర్తీ చేస్తోంది. జట్టుకు కొత్త ప్రధాన కోచ్ గా అభిషేక్ నాయర్ నియమించిన కేకేఆర్.. గురువారం (నవంబర్ 13) షేన్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ప్రకటించింది. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీని కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నారు. శుక్రవారం (నవంబర్ 14) కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ సౌథీని కొత్త బౌలింగ్ కోచ్‌గా ధృవీకరించారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో సౌథీ కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. 

"ఈసారి కోచింగ్ హోదాలో టిమ్ సౌతీని కేకేఆర్ ఫ్యామిలీలోకి తిరిగి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. "టిమ్ అపారమైన అనుభవం, సాంకేతిక నైపుణ్యం మా బౌలింగ్ యూనిట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అతని నాయకత్వ లక్షణాలు, ప్రశాంతమైన విధానం అతన్ని మా యువ బౌలర్లకు ఆదర్శవంతమైన గురువుగా చేస్తాయి". అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ చెప్పుకొచ్చారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌథీ ఇంగ్లాండ్ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఈ కివీస్ మాజీ పేసర్ కు ఇదే తొలిసారి.

"కేకేఆర్ నాకు ఎప్పుడూ ఫ్యామిలీలా అనిపిస్తుంది. బౌలింగ్ కోచ్ గా జట్టులో చేరడం గౌరవంగా ఉంది. ఫ్రాంచైజీకి అద్భుతమైన సంస్కృతి, ఎమోషనల్ ఫ్యాన్స్, గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. బౌలర్లతో కలిసి పనిచేయడానికి.. ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టు విజయం సాధించడానికి నా వంతు కృషి చేస్తాను". అని బౌలింగ్ కోచ్ గా ప్రకటించిన తర్వాత సౌతీ అన్నాడు. సౌథీ మూడు సీజన్ ల పాటు కేకేఆర్ జట్టు తరపున ఆడాడు. చివరిసారిగా 2023లో కేకేర్ జట్టులో బౌలర్ గా ఆడిన ఈ కివీస్ పేసర్.. ఆ తర్వాత ఐపీఎల్ లో ఎవరు కొనుగోలు చేయకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 

2025లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2024 లో శ్రేయాస్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరకపోవడంతో 2026 ఐపీఎల్ సీజన్ లో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది.