IND vs SA: 5 వికెట్లతో బుమ్రా విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా

IND vs SA: 5 వికెట్లతో బుమ్రా విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యేలా చేశారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా కేవలం 159 పరుగులకే ఆలౌటైంది. 31 పరుగులు చేసిన మార్క్రామ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ ఆటగాళ్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.          

8 వికెట్ల నష్టానికి 154 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. చివరి రెండు వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. హార్మర్, మహరాజ్ ఇద్దరినీ బుమ్రా ఒకే ఓవర్లో బౌల్డ్ చేశాడు. మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో సెషన్ లో విఫలమైంది. ఈ సెషన్ లో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత కుల్దీప్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ చేయాలని భావించిన వియాన్ ముల్డర్ (24) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా ఒక ఇన్ స్వింగ్ తో టోనీ డి జోర్జీ (24) ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 120 పరుగుల వద్ద సఫారీలు సగం జట్టును కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ కాసేపు వికెట్ల పతనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. 

Also Read:- రెండో సెషన్‌లో ఐదు వికెట్లు.. టీమిండియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా విల విల

వీరిద్దరూ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. 12 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని ఆపినప్పటికీ.. సిరాజ్ ఈ జోడీని విడగొట్టాడు. కైల్ వెర్రెయిన్ (16)ను ఎల్బీడబ్ల్యూ చేసి టీ విరామానికి ముందు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఊపులో ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ను క్లీన్ బౌల్డ్ చేసి సఫారీలను కోలుకొని దెబ్బ తీశాడు. దీంతో సౌతాఫ్రికా 147 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. టీ విరామానికి ముందు కుల్దీప్ యాదవ్ కార్బిన్ బాష్ (3) వికెట్ పడగొట్టి మరో షాక్ ఇవ్వడంతో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులతో సౌతాఫ్రికా టీ విరామానికి వెళ్ళింది.   

తొలి గంట సఫారీలదే:

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ తీసుకుంది. తమ నిర్ణయం కరెక్ట్ అని నిరూపిస్తూ సఫారీ ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) తొలి వికెట్ కు మంచి ఆరంభం ఇచ్చారు. ఓ వైపు మార్కరం పరుగులు చేయడానికి ఇబ్బందిపడినా మరో ఎండ్ లో రికెల్టన్ బౌండరీల వర్షం కురిపించాడు. 23 బంతికి పరుగుల ఖాతా తెరిచిన మార్క్రామ్ క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆధిపత్యం చూపిస్తూ ఈ సఫారీ ఓపెనర్ వేగంగా పరుగులు రాబట్టాడు. అద్భుతంగా ఆడుతున్న వీరిద్దరి జోడీ తొలి వికెట్ కు 57 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ దిశగా బాటలు వేశారు. 

బుమ్రా దెబ్బకు సఫారీ ఓపెనర్లు ఔట్:

ప్రమాదకరంగా మారుతున్న మార్క్రామ్ (31), రికెల్టన్ (23) జోడీని బుమ్రా విడగొట్టాడు. ఒక ఇన్ స్వింగ్ బాల్ తో రికెల్టన్ ను బౌల్డ్ చేశాడు. దీంతో 57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో కుదురుకుని మంచి టచ్ లో కనిపించిన మార్క్రామ్ ను బుమ్రా ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. వెంటనే కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగి సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (3) ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో వికెట్ నష్టపోకుండా 57 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 71 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దశలో సౌతాఫ్రికా జట్టును టోనీ డి జోర్జీ (15), వియాన్ ముల్డర్ (22) ఆదుకున్నారు. 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంచ్ వరకు మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు.