IND vs SA: రెండో సెషన్‌లో ఐదు వికెట్లు.. టీమిండియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా విల విల

IND vs SA: రెండో సెషన్‌లో ఐదు వికెట్లు.. టీమిండియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా విల విల

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి సెషన్ లో మూడు వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు రెండో సెషన్ లో ఐదు వికెట్లు పడగొట్టి సఫారీలను కష్టాల్లోకి నెట్టారు. శుక్రవారం (నవంబర్ 14) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజు టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రిస్టన్ స్టబ్స్ (15) ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.      

మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో సెషన్ లో విఫలమైంది. ఈ సెషన్ లో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత కుల్దీప్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ చేయాలని భావించిన వియాన్ ముల్డర్ (24) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా ఒక ఇన్ స్వింగ్ తో టోనీ డి జోర్జీ (24) ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 120 పరుగుల వద్ద సఫారీలు సగం జట్టును కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ కాసేపు వికెట్ల పతనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. 

Also Read:- 5 వికెట్లతో బుమ్రా విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా

వీరిద్దరూ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. 12 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని ఆపినప్పటికీ.. సిరాజ్ ఈ జోడీని విడగొట్టాడు. కైల్ వెర్రెయిన్ (16)ను ఎల్బీడబ్ల్యూ చేసి టీ విరామానికి ముందు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఊపులో ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ను క్లీన్ బౌల్డ్ చేసి సఫారీలను కోలుకొని దెబ్బ తీశాడు. దీంతో సౌతాఫ్రికా 147 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. టీ విరామానికి ముందు కుల్దీప్ యాదవ్ కార్బిన్ బాష్ (3) వికెట్ పడగొట్టి మరో షాక్ ఇవ్వడంతో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులతో సౌతాఫ్రికా టీ విరామానికి వెళ్ళింది.