IND vs SA: ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై తొలి రోజే పట్టు

IND vs SA: ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై తొలి రోజే పట్టు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు పూర్తి ఆధిపత్యం చూపించింది. శుక్రవారం (నవంబర్ 14) జరిగిన తొలి రోజు ఆటలో బౌలింగ్ లో అదరగొట్టి సఫారీలను తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్ లో నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (13), వాషింగ్ టన్ సుందర్ (6) ఉన్నారు. ప్రస్తుతం గిల్ సేన తొలి ఇన్నింగ్స్ లో 122 పరుగులు వెనకబడి ఉంది. వెలుతురు మందగించడంతో మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే తొలి రోజు ఆటను నిలిపివేశారు. 

సౌతాఫ్రికాను 159 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఆచితూచి ఇన్నింగ్స్ ఆరంభించింది. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ ఇబ్బందిపడ్డారు. ఇద్దరూ కూడా పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. భారత ఓపెనర్లను ఒత్తిడిలో పడేసిన సౌతాఫ్రికా.. జైశ్వాల్ వికెట్ రాబట్టుకుంది. మార్కో జాన్సెన్ బంతిని కట్ చేయబోయి జైశ్వాల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 18 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సుందర్ తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజు ముగించారు. 

159 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్: 

 టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా కేవలం 159 పరుగులకే ఆలౌటైంది. 31 పరుగులు చేసిన మార్క్రామ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ ఆటగాళ్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. సఫారీ ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) తొలి వికెట్ కు మంచి ఆరంభం ఇచ్చారు.
     
బుమ్రా విజృంభించడంతో మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులతో తొలి సెషన్ ముగించింది. లంచ్ తర్వాత రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా పూర్తిగా విఫలమైంది. ఈ సెషన్ లో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడంతో 120 పరుగుల వద్ద సఫారీలు సగం జట్టును కోల్పోయింది. టీ విరామానికి ముందు సిరాజ్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులతో సౌతాఫ్రికా టీ విరామానికి వెళ్ళింది. 8 వికెట్ల నష్టానికి 154 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. చివరి రెండు వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.