
ముందుకొచ్చిన బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ
మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ఇండియా అఫైర్స్ చీఫ్ గణేశన్ భేటీ
500 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: కూల్డ్రింకులు, బీర్లు, పెర్ఫ్యూమ్ పరిశ్రమలకు అవసరమయ్యే అల్యూమీనియం టిన్నులను తయారు చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆదివారం సెక్రటేరియెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టబోయే పెట్టుబడులు, సంస్థ విస్తరణ ప్రణాళికను మంత్రి శ్రీధర్‌బాబుకు గణేశన్ వివరించారు. సంస్థ యూనిట్‌ను నెలకొల్పితే 500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
సంస్థకు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సర్కారు సిద్ధంగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరుకుతున్న టిన్ బీర్లు మహారాష్ట్రలో ఫిల్లింగ్ అవుతున్నాయని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లలో టిన్నుల వాడకం 25 శాతం వరకుందన్నారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్/ఫిల్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానాల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని పేర్కొన్నారు. 500 మిల్లీ లీటర్ల టిన్నుల్లో బీర్లను ఫిల్ చేసి అమ్మితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుందని, ప్రభుత్వానికి దాని వల్ల రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.