హ్యాపీ బర్త్ డే బాలయ్య

హ్యాపీ బర్త్ డే బాలయ్య

చాలామంది హీరోలు రికార్డులు సృష్టిస్తారు. కానీ ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. డైనమైట్స్‌లా దూసుకొచ్చే డైలాగ్స్..ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే ఎక్స్‌ప్రెషన్స్‌..మొత్తంగా బాలకృష్ణ సినిమా అంటేనే ఓ మాస్‌ ట్రీట్ లా ఉంటుంది. నందమూరి వారసుడిగానే కాదు.. తెలుగు ప్రజల అభిమాన నాయకుడిగానూ తిరుగులేని ఇమేజ్‌ని సంపాదించిన బాలయ్యది ఓ మెమొరబుల్ జర్నీ.

నాన్నతో మొదలై..

పద్నాలుగేళ్ల వయసులో తన తండ్రి ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ‘తాతమ్మ కల’ చిత్రంతో సిల్వర్‌‌ స్క్రీన్‌కి పరిచయమయ్యారు బాలయ్య.  ఆ తర్వాత నాన్నతో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు.  అయితే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాన్నగారి సినిమాతో కాదు.  భారతి, వాసు డైరెక్ట్ చేసిన ‘సాహసమే జీవితం’ సినిమాతో.  దీనికి ఇళయరాజా సంగీతం అందించారు.  ఒకే కాలేజ్‌లో చదువుకునే ఇద్దరు ప్రేమలో పడటం, అంతస్థుల కారణంగా వారి ప్రేమకు సవాళ్లు ఎదురవడం, ఇతర విద్యార్థుల సాయంతో వాటిని ఎదుర్కొని సక్సెస్ కావడం ఈ సినిమా కథ.  ఇలా ఓ లవ్‌స్టోరీతో హీరోగా మారిన బాలకృష్ణ.. ఇన్నేళ్ల కెరీర్‌‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. ఇప్పటికీ రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల కోసం వెతుకుతూనే ఉంటారు. 

కాంబో రిపీట్స్

తనకి విజయాల్ని అందించిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి పని చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు బాలకృష్ణ.  అందరికంటే ఎక్కువగా ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో నటించారాయన.  ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మొత్తం పదకొండు సినిమాలు వచ్చాయి.  ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాలు చేశారు. బోయపాటి శ్రీనుతో ఇప్పటి వరకు మూడు మూవీస్‌ చేశారు. చాలా వేగంగా సినిమాలు చేయడం కూడా ఇలా కాంబినేషన్లు రిపీట్ కావడానికి కారణమని చెప్పాలి.  తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశారు బాలయ్య.  ఓ సంవత్సరం ఆయన నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి.  

సమ్‌థింగ్ స్పెషల్

ఆయన ఇరవై అయిదో చిత్రం నిప్పులాంటి మనిషి. యాభయ్యో చిత్రం నారీ నారీ నడుమ మురారి.  డెబ్భై అయిదో సినిమా కృష్ణబాబు.  వందో మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి.  సాధారణంగా హీరోల పాత్రలకు వారి పేరునే పెట్టడం అరుదుగా జరుగుతుంది. కానీ బాలయ్య ఏడు సినిమాల్లో సొంత పేరుతో యాక్ట్ చేశారు.  సింహం అనే మాట కలిసొచ్చే టైటిల్స్ తో ఎనిమిది సినిమాలు చేశారు.  రెండు సినిమాల్లో పాటలు పాడారు.  మూడు సినిమాలకు సమర్పకుడుగా వ్యవహరించారు.  రెండే రెండు చిత్రాలు నిర్మించారు.  ఇక  పన్నెండు సినిమాల్లో పోలీసుగా నటించారు.  ఒకే ఒక్క సినిమాలో అతిథి పాత్రలో నటించారు.  ఇన్నేళ్లలో ఒక్క యాడ్‌ కూడా చేయలేదు.. చేయడానికి ఇష్టపడరు.  బాలయ్య సరసన ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ విజయశాంతి. ఇద్దరూ కలిసి పదిహేడు సినిమాల్లో నటించి హిట్‌ పెయిర్‌‌ అనిపించుకున్నారు. ఆయన కెరీర్‌‌లో ఇలాంటి స్పెషాలిటీస్ ఇంకా చాలానే ఉన్నాయి. 

ప్రయోగశాల

ఎప్పుడూ ఒకేలా కనిపించడం నచ్చదు బాలయ్యకి. అందుకే ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.  కొత్త ట్రెండ్స్ కి తెర తీస్తుంటారు.  కమర్షియల్ సినిమాల మధ్యలో ‘ఆదిత్య 369’ లాంటి సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని చేసి హిట్టు కొట్టారాయన. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లాంటి జానపద చిత్రమూ చేశారు.  ‘సమరసింహారెడ్డి’గా బాలయ్య సృష్టించిన హంగామా చూశాక తెలుగునాట ఫ్యాక్షన్ కథల హవా మొదలైంది. ‘భైరవద్వీపం’ సినిమా చూశాక ఆయనలా ఎవరైనా చేయగలరా అనిపించింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా వెండితెరపై కనిపిస్తే మరోసారి హిస్టారికల్ సినిమాలవైపు అందరి మనసూ మళ్లింది. ఇక పౌరాణిక పాత్రలంటే బాలయ్యకి ప్రాణం.  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణ దేవరాయలు, దుష్యంతుడు, హరిశ్చంద్రుడు అంటూ రకరకాల క్యారెక్టర్స్ లో పరకాయ ప్రవేశం చేశారు.  అందరూ ఒకదారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సడెన్‌గా తానొక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి అందరి చూపునూ తనవైపు తిప్పేసుకోవడం బాలయ్య స్పెషాలిటీ.

పంచ్ పవర్

టాలీవుడ్‌లో పంచ్‌ డైలాగులకి బాలయ్య కేరాఫ్.  ఎలాంటి డైలాగ్ అయినా ఆయన నోటి నుంచి వస్తే పవర్‌‌ఫుల్‌గా మారిపోతుంది. అందుకే ఏరి కోరి ఆయనకి పంచ్ డైలాగ్స్ రాస్తుంటారు మేకర్స్.  ఫ్లూటు జింకముందు ఊదు, సింహం ముందు కాదు.. ఒకడు నాకు ఎదురైతే వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా.. రాజకీయం నువ్వు తినే ఫుడ్‌లో ఉందేమో, నాకు నా బ్లడ్‌లోనే ఉందిరా బ్లడీ ఫూల్.. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్‌‌ని అనుకున్నావా, షూటర్‌‌ని.. ఒక మాట నువ్వంటే శబ్దం, అదే మాట నేనంటే శాసనం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాలయ్య డైలాగ్స్‌ ఎన్నో ఉన్నాయి. 

స్పెషల్ ట్రీట్

చాలామంది హీరోలు డ్యూయెల్ రోల్ చేసే చాన్స్ వస్తే చేద్దామని వెయిట్ చేస్తుంటారు. కానీ బాలయ్య చాలా ఈజీగా ద్విపాత్రాభినయం చేసేస్తారు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇద్దరిగా కనిపించి మురిపించారాయన. బాలకృష్ణ మొదటిసారి డబుల్ రోల్ చేసిన సినిమా అపూర్వ సహోదరులు. కె.రాఘవేంద్రరావ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాము, అరుణ్ కుమార్ అనే అన్నదమ్ములుగా కనిపించారాయన. ఆ తర్వాత రాముడు భీముడు, ఆదిత్య 369, బ్రహ్మర్షి విశ్వామిత్ర, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరిపిడుగు, ఒక్క మగాడు, పాండురంగడు, సింహా, పరమవీరచక్ర, అధినాయకుడు, లెజెండ్ చిత్రాల్లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించి డబుల్ ట్రీట్ ఇచ్చారు బాలకృష్ణ. రీసెంట్‌గా వచ్చి న ‘అఖండ’లోనూ అన్నదమ్ములుగా తన నట విశ్వరూపం చూపించారు. ఇక ‘అధినాయకుడు’ చిత్రంలో ట్రిపుల్‌ రోల్ కూడా చేసి సత్తా చాటారు బాలకృష్ణ.

కల తీరేదెన్నడో!

ప్రతి నటుడికీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. బాలకృష్ణకీ ఉంది. అదే.. నర్తనశాల. ఎన్టీఆర్‌‌ ఒకప్పుడు ఈ సినిమా చేశారు.  తాను ఆ చిత్రాన్ని తన స్టైల్లో తీయాలని బాలయ్య ఆశపడ్డారు. ప్రయత్నించారు కూడా. అయితే ద్రౌపది పాత్రలో నటించాల్సిన సౌందర్య చనిపోవడంతో ఆ ప్రాజెక్ట్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత అలాంటి నటి దొరకకపోవడంతో పాటు ఏదో ఒక కారణంతో ప్రాజెక్ట్ వాయిదా పడుతూనే వచ్చింది  తప్ప ఇంతవరకు పట్టాలెక్కలేదు. దాంతో బాలయ్య కల ఇప్పటికీ కలలానే ఉంది.  ఏదో ఒకరోజు బాలయ్య తన కలను నిజం చేసుకుంటారు అంటారంతా. ఎందుకంటే ఇప్పటికీ అదే ఎనర్జీ..అదే డెడికేషన్. ఏదో ఒకటి కొత్తగా చేయాలనే తపన.  సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే తెగువ. అప్పుడెప్పుడో ‘విశ్వామిత్ర’ సినిమా సమయంలో టపాసు పేలి గాయమైనా లెక్క చేయకుండా షాట్ పూర్తి చేశారట బాలయ్య. ఇటీవల ‘అఖండ’ షూటింగ్‌లోనూ చెయ్యి ఫ్రాక్చర్ అయినా నొప్పితోనే వర్క్ పూర్తి చేసి తాను అప్పటికీ ఇప్పటికీ తనలో మార్పేం లేదని ప్రూవ్ చేశారాయన. అంతేనా.. అటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇటు ఓటీటీలోనూ ‘అన్‌స్టాపబుల్‌’గా అదరగొడుతున్నారు.  ఎందుకంటే.. ఆయన నందమూరి బాలకృష్ణ.  కమిట్‌మెంట్‌కి కేరాఫ్. ఆయన తొడగొడితే రికార్డులు.  మీసం తిప్పితే రివార్డులు.  మరికొన్ని దశాబ్దాల పాటు ఆయన కెరీర్ ఇలాగే కొనసాగాలని, తెలుగు ప్రేక్షకుల్ని అన్‌స్టాపబుల్‌గా ఎంటర్‌‌టైన్ చేయాలని కోరుకుంటూ.. బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు.