- బ్యాలెన్స్‌డ్‌గా మూలధనవ్యయం, వృద్ధి
- బడ్జెట్ 2026 - 27పై ప్రధానిమోదీ ప్రశంసలు
- వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది అని కామెంట్
న్యూఢిల్లీ:కేంద్ర బడ్జెట్ 2026–27 భారీ మూలధన వ్యయం (క్యాపెక్స్), అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతూకం పాటించిందని, ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్.. ప్రపంచ వేదికపై దేశ పటిష్టమైన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో ఒక హైవే లాంటిదని అభివర్ణించారు. దేశంలోని140 కోట్ల మంది ఆకాంక్షలకు ఈ పద్దు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్ అని, వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది అని తెలిపారు. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ భారత్‌కు కేటాయింపులు చేశారని చెప్పారు.
ఇది ‘యువ శక్తి బడ్జెట్’ అని, యువతను నాయకులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందులో అనేక నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.విశ్వసనీయమైన పాలనకు, మానవీయ కోణంలో సాగే ఆర్థిక చట్రానికి ఈ బడ్జెట్ నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల పరంగా డెడికేటెడ్ ఫ్రైట్కారిడార్, జలమార్గాల విస్తరణ, హై-స్పీడ్ రైలు కారిడార్, టైర్-2, టైర్-3 నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే దేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మార్చేందుకు పన్ను రాయితీలు ప్రకటించినట్లు వివరించారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే లక్ష్యం..
కేవలం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటమే కాకుండా, భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుందని, ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’కు కొత్త శక్తిని, వేగాన్ని అందిస్తుందన్నారు. ఈ సంస్కరణలు యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. 10 కోట్లకు పైగా మహిళలు ఉన్న స్వయం సహాయక బృందాల కోసం ఆధునిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే, ప్రతి జిల్లాలో విద్యార్థినుల కోసం కొత్త హాస్టళ్ల నిర్మాణాన్ని ప్రకటించినట్లు తెలిపారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) గ్లోబల్ స్థాయి లో ఎదిగే శక్తిని ఈ బడ్జెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయో ఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం, రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, క్రిటికల్ మినరల్స్ రంగం బలోపేతం, టెక్స్‌టైల్ రంగంలో కొత్త పథకాలలాంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. వ్యవసాయం, పాడి, మత్స్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య తనిస్తున్నదని మోదీ తెలిపారు. కొబ్బరి, జీడిపప్పు, కోకో, చందనం సాగు చేసే రైతులకు ఈ బడ్జెట్‌లో ముఖ్యమైన చర్యలు చేపట్టారని, ముఖ్యంగా ‘భారత్ –విస్తార్’ ఏఐ టూల్ రైతులకు వారి ప్రాంతీయ భాషలోనే సమాచారాన్ని అందించి సహాయపడుతుందన్నారు.
