బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి.. భక్తుల కోళాహలం నడుమ శోభాయాత్ర సాగిందిలా

బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి.. భక్తుల కోళాహలం నడుమ శోభాయాత్ర సాగిందిలా

ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత.. అంతే ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యింది. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత నిమజ్జన ప్రక్రియ ముగిసింది. ఆద్యంతం భక్తుల కోలాహలం నడుమ సాగిన శోభాయాత్ర సాయంత్రం 6 గంటలలోపే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత భారీ క్రేన్లతో బాలాపూర్ గణేష్  నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహరాజ్ కే.. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా.. అంటూ నినాదాలు, కేరింతల నడుమ బాలాపూర్ గణపయ్య నిమజ్జనం జరిగింది. 

బాలాపూర్ - ట్యాంక్ బండ్.. శోభాయాత్ర సాగిందిలా:

హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగింది. శనివారం (సెప్టెంబర్ 06) ఉదయం లడ్డూ ప్రసాదం వేలంపాట ముగిసిన తర్వాత.. ప్రారంభమైన శోభాయాత్ర.. భక్తుల కోలాహలం నడుమ ఎంతో వేడుకగా ముందుకు సాగింది. 

బాలాపూర్ నుంచి బార్కస్ రోడ్డుకు చేరుకున్న గణనాథుడి యాత్ర.. భక్తుల ఆటలు, పాటలు, డ్యాన్సుల నడుమ సాగింది. ప్రత్యేక బ్యాండు మేళానికి భక్తులు శోభాయాత్రలో చిందేశారు. బాలాపూర్ నుంచి కాస్త నెమ్మదిగా కదిలిన యాత్ర.. అక్కణ్నుంచి చంద్రాయణగుట్ట కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా మీదుగా సాగింది. 

శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీఎస్పీ స్నేహ శోభాయాత్ర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ యాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. 

►ALSO READ | బై బై గణేశా: విద్యుత్ కాంతులతో ట్యాంక్ బండ్ కళకళ.. కనులపండుగగా గణేష్ నిమజ్జనం..

చంద్రాయణ గుట్ట నుంచి ఫలక్ నుమా, ఇంజన్ బౌలి, అలియాబాద్ ప్రాంతానికి కాస్త వేగంగానే యాత్ర ముందుకు సాగింది. అక్కడి నుంచి లాల్ దర్వాజా మీదుగా శోభాయాత్ర కదులుతోంది. గణేష్ మరాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు యాత్రలో చిందేశారు.

లాల్ దర్వాజా దాటి శాలిబండ పిస్తా హౌస్ చేరుకున్న శోభాయాత్ర.. అక్కడి నుంచి చార్మినార్ కు చేరుకుంది. చార్మినార్ దగ్గర భారీ ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్,  అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. ఆ తర్వాత భారీ క్రేన్లతో గణపయ్యను నిమజ్జనం చేశారు. 

  రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ:

బాలాపూర్ లడ్డూ ధర  రికార్డ్ ధర పలికింది. 116 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం  రూ. 35 లక్షలు పలికింది. ఖర్మన్ ఘాట్ కు చెందిన  లింగాల దశరథ గౌడ్  రూ. 35లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ. 4లక్షల 99 వేలు అధికంగా పలికింది.  దశరథ గౌడ్ గత  ఆరేళ్లుగా వేలంలో పాల్గొంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు.. ఈసారి 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు . 

బాలాపూర్ లడ్డూ వేలంలో చంపాపేట్ నుంచి మర్రి రవికిరణ్​ రెడ్డి, ఎల్బీనగర్​నుంచి అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మన్​ఘాట్​కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివారెడ్డి, కందుకూరు కొత్తగూడానికి చెందిన సామ రామ్ రెడ్డి, పీఎస్ కె గ్రూప్​కు చెందిన మెంబర్స్, చంపాపేట్​కు చెందిన జిట్టా పద్మా సురేందర్ పోటీ పడ్డారు.

లడ్డు వేలం పాట అంటేనే గుర్తుకు వచ్చే బాలాపూర్​ గణేశ్..ఈ లడ్డు  కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే వేలంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మొదట భక్తిగా..తర్వాత సెంటిమెంట్గా..అనంతరం  ప్రెస్టీజ్ఇష్యూగా మారిపోయింది. ఏడాదికేడాది  ఈ లడ్డు ధర పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు. 1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి  వినాయకుడిని ప్రతిష్ఠించారు.

1994లో మొదటిసారి లడ్డు వేలం పాట మొదలుపెట్టగా  రూ.450కి కొలన్ ​మోహన్​రెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించారు. 2020లో కరోనా కారణంగా వేలం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ కు అందజేశారు. 2023లో 36 మంది పాల్గొనగా రూ. 27 లక్షలకు దాసరి దయానంద్​రెడ్డి చేజిక్కించుకున్నారు. గత ఏడాది నలుగురు మాత్రమే పాల్గొనగా, బాలాపూర్​కే చెందిన బీజేపీ లీడర్​ కొలన్ ​శంకర్​రెడ్డి అత్యధికంగా రూ.30 లక్షల వెయ్యికి కైవసం చేసుకున్నారు.