
హైదరాబాద్, వెలుగు: సిటీలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రుణాలు అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. శుక్రవారం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా సిటీలో అమలయ్యే పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్లోని చెత్తను కాలనీల్లో ఇష్టానుసారంగా పడేయకుండా స్వచ్ఛ ఆటోలో వేసే విధంగా స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ప్రతినిధులు వారి సంఘం సభ్యులు స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందిస్తున్నారో లేదో పరిశీలన చేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఇంటి చెత్తను గార్బేజ్ పాయింట్ వద్ద గాని, ఇంకొక చోట గాని ఇష్టానుసారంగా వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్హెచ్ జీ నెలవారీ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై, ఫైనాన్షియల్ వివరాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. స్ట్రీట్ వెండర్లకు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని, ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు.
సీనియర్ సిటిజన్లకు వికాసం ద్వారా దరఖాస్తులను వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కు లేని వారికి ఓటరుగా నమోదు చేయించి ఓటు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రారెడ్డి, పీడీ సౌజన్య పాల్గొన్నారు.