కోరుట్ల ఎమ్మెల్యే ఇంటి పనులకు బల్దియా లేబర్

కోరుట్ల ఎమ్మెల్యే ఇంటి పనులకు బల్దియా లేబర్
  •     ఫామ్​హౌస్​లో  రైతు కూలీలుగానూ వాళ్లే..
  •     పదేండ్లుగా సొంత పనుల కోసం 17 మంది సిబ్బంది
  •     ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు
  •     మున్సిపల్​ ఆఫీసు ఎదుట కాంగ్రెస్​ నేతల ఆందోళన
  •     రూ.3 కోట్లు రికవరీ చేయాలని డిమాండ్​

జగిత్యాల/మెట్​పల్లి, వెలుగు:  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ నేత కల్వకుంట్ల విద్యాసాగర్​రావు తమ ఇండ్లు, ఫామ్​హౌస్​లలో 17 మంది బల్దియా సిబ్బందితో పదేండ్లుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా మెట్​పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల నుంచి వేతనాలు తీసుకుంటున్న శానిటేషన్ సిబ్బందితో ఎమ్మెల్యే సొంత పనులు చేయించుకోవడంపై దుమారం రేగుతోంది.

ఓ వైపు బల్దియాలో సరిపడా శానిటేషన్ సిబ్బంది లేక  ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతుండగా, ఉన్న సిబ్బందిలో ఏకంగా 17 మందిని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇండ్లు, ఫామ్​హౌస్​లలో పనులకు పెట్టుకోవడాన్ని  నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బల్దియా ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ఇందుకు సంబంధించి  బల్దియా నుంచి లేబర్లకు పదేండ్ల పాటు  అందజేసిన రూ.3 కోట్లకుపైగా వేతనాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. 

డ్రైవర్లు.. స్వీపర్లు.. వంట మనుషులు..రైతుకూలీలు.. అంతా బల్దియాల సిబ్బందే! 

బీఆర్ఎస్​కు చెందిన సీనియర్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్​రావు తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు కోరుట్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల నుంచి గెలుపొందారు. వీరిద్దరూ తమ కుటుంబాలతో  హైదరాబాద్​లోని  కొంపెల్లితోపాటు జగిత్యాల జిల్లా మెట్​పల్లి టౌన్​లోని బస్టాండ్​​ సమీపంలోని ఇంట్లో  ఉంటున్నారు. అలాగే ఈ ఫ్యామిలీకి సిద్దిపేట జిల్లా గజ్వేల్​ సమీపంలో  సుమారు 300 ఎకరాల్లో ఫామ్​హౌస్ ​ఉంది.

ఈ ఇండ్లలోనూ, ఫామ్​హౌస్​లలోనూ డ్రైవర్లుగా, స్వీపర్లుగా, వంట మనుషులుగా,  రైతుకూలీలుగా అంతా మెట్​పల్లి, కోరుట్ల నుంచి సుమారు 17 మంది బల్దియా సిబ్బందే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.  వీరికి బల్దియాల ఖాతాల నుంచే నెలనెలా ఒక్కొక్కరికి రూ.15,500 వేతనంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తున్నారు. పదేండ్లపాటు బీఆర్ఎస్​ అధికారంలో ఉండడంతో వీరి ఆగడాలకు ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఈ విషయం వెలుగుచూసింది.  

కాగా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోరుట్ల బల్దియాలో  78 మంది, మెట్​పల్లి బల్దియాలో 20 మంది శానిటేషన్ సిబ్బందిని రిక్రూట్ ​చేసుకోవాలని, ఇందుకు పర్మిషన్​ ఇవ్వాలని కొన్నాళ్ల క్రితం బల్దియా ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు.  ఉన్న సిబ్బందిలో 17మందిని ఎమ్మెల్యే ఇండ్లలో, ఫామ్​హౌస్​లలో పనిచేయిస్తూ, ఆ విషయాన్ని దాచిపెట్టి కొత్తగా మరింత మంది కోసం ప్రపోజల్స్ ​పంపిన ఆఫీసర్ల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  
 
రూ. 3 కోట్లు రికవరీ చేయాలి: జువ్వాడి కృష్ణారావు 

శానిటేషన్ సిబ్బందితో రూల్స్​కు విరుద్ధంగా సొంత పనులు చేయించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన తండ్రి విద్యాసాగర్ రావు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు డిమాండ్ ​చేశారు.  సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోరుట్ల, మెట్​పల్లి బల్దియాల ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు.  దాదాపు 17 మంది లేబర్లకు ప్రతి నెలా సుమారు రూ.3లక్షలను బల్దియా నుంచి చెల్లించారని, ఈ పదేండ్లలో రూ. 3 కోట్లకు పైగా అయినందున ఆ మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆయన కొడుకు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నుంచి రకవరీ చేయాలని డిమాండ్​ చేశారు. ​

పని చేయొద్దనే రూల్​ ఏమీ లేదు

కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఇద్దరు లేబర్లు మాత్రమే పని చేస్తున్నారు. మున్సిపల్ లేబర్​ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో వర్క్ చేయవద్దనే రూల్​ ఏమీ లేదు. ఒకవేళ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లేబర్​తో పనిచేయించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఆమేరకు వెనక్కి తీసుకుంటాం.
-– రాజేశ్వర్ , కోరుట్ల కమిషనర్