సొంత ఆదాయంతోనే బల్దియా మెయింటనెన్స్

సొంత ఆదాయంతోనే బల్దియా మెయింటనెన్స్

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ 2023–24 సంవత్సరానికి గాను మరోమారు ఆశల బడ్జెట్‍ రూపొందించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం రూ.612 కోట్ల 29 లక్షలతో అంచనాల ముసాయిదా బడ్జెట్​ను ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదించింది.  రెగ్యూలర్‍ టాక్స్‍ రూపంలో వచ్చే ఇన్‍కమ్‍ ఆధారంగా మూడేళ్ల కింద అధికారులు రూ.305 కోట్లతో  రియాలిటీ బడ్జెట్‍ ప్రవేశపెట్టారు. వచ్చే ఆదాయం విషయంలో అప్పటికిప్పుడు పెద్దగా పరిస్థితులేవి మారకున్నా.. రూ.612 కోట్లతో ఈసారి దానిని డబుల్ చేశారు. ఇందులో రూ.213 కోట్ల 63 లక్షలు సాధారణ పన్నుల రూపంలో, రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు.

సొంత ఆదాయంతోనే.. బల్దియా మెయింటనెన్స్

లోకల్​గా వచ్చే పన్నుల ద్వారానే బల్దియా వెళ్లదీసేలా బడ్జెట్‍ అంచనా ఉంది. బల్దియా సొంత ఆదాయం రూ.213.63 కోట్లు ఉండగా.. రూ.75 కోట్లు సిబ్బంది జీతభత్యాలు, రూ.26.69 కోట్లు పారిశుద్ధ్య నిర్వహణ, రూ.16 కోట్లు విద్యుత్ బిల్లులు, రూ.21. 35 కోట్లు గ్రీన్ బడ్జెట్, రూ.23.45 కోట్లు ఇంజనీరింగ్ విభాగానికి, రూ.13.6 కోట్లు జనరల్‍ మెయింటనెన్స్‍, రూ.1 కోటి 20 లక్షలు టౌన్ ప్లానింగ్, రూ.70 లక్షలు డిజాస్టర్ రెస్పాన్స్ కోసం కేటాయించారు. విలీన గ్రామాలు, బలహీన వర్గాలు నివసించే మురికివాడల అభివృద్దికి రూ.12.29 కోట్లు, ప్రజా సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, జంతువధ శాలలు, వీధి వ్యాపారులు వెండింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు రూ.1 కోటి 60 లక్షలు, వార్డుల వారిగా అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.22.98 కోట్లు కేటాయించారు.

డెవలప్‍ చేస్తాం.. టెండర్లు పిలుస్తాం

ముంపు నివారణ చర్యల్లో భాగంగా సీఎం అష్యూరెన్స్‍ స్కీం, స్మార్ట్ సిటీ, మున్సిపల్ నిధులతో రూ.235 కోట్లతో డక్టులు, కల్వర్టులు, బ్రిడ్జిలు, స్ట్రాం వాటర్ డ్రైన్లు, డక్ట్  డ్రైన్ ల పనులు కొనసాగుతున్నట్లు మేయర్ చెప్పారు. వరంగల్ శివనగర్ ప్రాంతంలో రూ.77.50 కోట్లతో చింతల్ ఫ్లై ఓవర్ నుంచి 12 మోరీల వరకు, సాకరాసికుంట నుంచి యూటీ వరకు  డ్రైన్ పనుల టెండర్ పూర్తయిందన్నారు. వరంగల్ లక్ష్మీపురంలో రూ.25.50 కోట్లతో, హనుమకొండ రామ్ నగర్‍లో రూ4.50కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 13 ప్రాంతాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. 57వ డివిజన్ వాజ్‍పేయి కాలనీలో రూ.4 కోట్లతో నిర్మించిన మోడల్ వైకుంఠధామం ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 

బల్దియా పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 మినీ స్టేడియాలు ఏర్పాటు  చేస్తున్నామన్నారు.  ప్రతి స్టేడియంలో 5 కోట్లతో సింథటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, క్రికెట్ నెట్ తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. రూ.75కోట్లతో రెండో విడత భద్రకాళి బండ్, రూ.22కోట్లతో  వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతుండగా.. రూ.15 కోట్లతో రంగసముద్రం చెరువు సుందరీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రూ.3 కోట్లతో బంధం చెరువు బండ్ పనులు చేపడతామని, నగరవ్యాప్తంగా 124 ఆధునిక బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్య,  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ , కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తదితరులున్నారు.