పచ్చని పల్లెను ఆగం జేసిన బల్దియా

పచ్చని పల్లెను ఆగం జేసిన బల్దియా
  • 10 డివిజన్ల మురుగు నీరు పసుమాముల చెరువులోకి..
  • గ్రామంలో పెరిగిపోతున్న డెంగీ, మలేరియా కేసులు
  • జీవనోపాధి కోల్పోయి కూలీలుగా మారిన మత్స్యకారులు
  • పంటకు నోచుకోకుండా 250 ఎకరాల ఆయకట్టు పడావు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఎల్​బీనగర్, వెలుగు: నూట పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో  చెరువు.. 250 ఎకరాల ఆయకట్టు.. చెరువులో చేపల పెంపకంతో మత్యకారులకు జీవనోపాధి.. పచ్చని పంట పొలాలు.. పాడి పశువుల పెంపకం.. ఇలా రంగారెడ్డి జిల్లాలోని  పసుమాముల గ్రామం కళకళలాడేది. కానీ నాలుగేండ్లుగా స్థానిక చెరువులోకి వస్తున్న డ్రైనేజీ ఆ గ్రామానికి శాపంలా మారింది. ఆ డ్రైనేజీతో చెరువు నాశనం కావడంతో పాటు పంటపొలాలు ఆగమయ్యాయి. కనీసం పశువుల కోసం గడ్డి పెంచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అధికారులు, పాలకులకు ఎన్ని వినతులు ఇచ్చి, తమ పరిస్థితిపై మొరపెట్టుకున్నా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని పసుమాముల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు పెరిగిపోయి డెంగీ, మలేరియా బారిన పడుతున్నామని వాపోతున్నారు.

గతంలో కుంట్లూరు.. ఇప్పుడు పసుమాములరంగారెడ్డి జిల్లా పసుమాముల గ్రామంలో సుమారు 1500 కుటుంబాలున్నాయి. ఇటీవల ఈ గ్రామం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోకి రాగా.. 2 వార్డులు ఏర్పాటు చేశారు. ఎల్​బీ నగర్, హయత్​నగర్, వనస్థలిపురం, బీఎన్​రెడ్డి నగర్, హస్తినాపురం, చంపాపేటతో పాటు చుట్టుపక్కల డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున డ్రైనేజీ వచ్చి ప్రస్తుతం పసుమాముల గ్రామంలోని చెరువులో కలుస్తోంది. ఇది వరకు సమీప కుంట్లూరులో ఉండే డ్రైనేజీని పైప్​లైన్ ​పెంచి నాలుగేండ్ల క్రితం పసుమాముల గ్రామ చెరువులోకి జీహెచ్ఎంసీ వదిలేసింది. దీంతో ఆ గ్రామానికి సమస్యలు మొదలయ్యాయి. గతంలో గ్రామానికి పైన ఉండే కుంట్లూరులో ఈ సమస్య ఉండగా ఆ గ్రామస్తులు సుమారు ఐదేండ్ల పాటు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.  నాలుగేండ్ల కిందట రూ.14 కోట్ల నిధులతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టి భూదాన్ కాలనీ వరకు తీసుకొచ్చి వదిలేశారు. దీంతో ఈ మురుగు నీరంతా కింది భాగంలో ఉన్న పసుమాములలోని చెరువులోకి చేరుతోంది.   

నీరు కలుషితమై దోమల వ్యాప్తి

మురుగు చేరడంతో పసుమాములలోని చెరువు నీళ్లు పూర్తిగా కలుషితమై దోమల వ్యాప్తి పెరిగి గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు సోకుతున్నాయి. డ్రైనేజీతో పాటు కెమికల్ డంప్ కూడా కలవడంతో దుర్వాసనకు అక్కడి జనం లంగ్స్​సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. ఈ చెరువు నుంచి గతంలో 250 ఎకరాలకు నీరు అంది పంటలు పండేవి. కానీ ఇప్పుడు మురుగు కారణంగా పంటలు పండటంలేదు. దీంతో ఆ ప్రాంతం మొత్తం బీడుపోయింది. వ్యవసాయం మీద ఆధారపడిన చాలా మంది కూలీలుగా, వాచ్ మన్లుగా, ఆటో డ్రైవర్లుగా మారిపోయారు. వ్యవసాయ కూలీలకు జీవనోపాధి లేకుండా పోయింది. చెరువు నీళ్లు కలుషితం కావడంతో చేప పిల్లలు వేస్తే  బతకడం లేదు. దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం 
చేస్తున్నారు.

ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు

ఈ సమస్య పరిష్కారానికి మత్స్యకారుల సంఘం తరఫున జిల్లా జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి, ఇరిగేషన్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి స్థానిక లీడర్లు, గ్రామస్తులు ఈ మధ్యే గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నారు. సమస్య తీరేవరకు పోరాడతామని తీర్మానించుకున్నారు. గతంలో కుంట్లూరులోని జయప్రకాశ్​ నగర్ వరకు చేపట్టిన బాక్స్ డ్రెయిన్​ పనులను విస్తరించి మురుగు నీటిని బాక్స్ డ్రెయిన్ ద్వారా మూసీలో కలిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధులతో కానీ ఈ పనులను చేపట్టాలని కోరుతున్నారు. బాక్స్ డ్రెయిన్ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్తున్నప్పటికీ .. రెండేళ్లుగా ఆ పనులు ముందుకు సాగడం లేదని గ్రామస్తులు అంటున్నారు.

పనులు కొనసాగుతున్నయ్​

రూ.32 కోట్లతో డ్రైనేజీ విస్తరణ పనులు ప్రారంభించాం. సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నయ్. ఈ ఫేజ్​లోనే పనులు పూర్తయ్యి పసుమాములలో  సమస్య పరిష్కారం అవుతుంది. థర్డ్ ఫేజ్ పనుల్లో ఈ మురుగు మూసీలో కలుస్తుంది. 

- మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 
ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం

300 కుటుంబాలు రోడ్డున పడ్డయ్​

117 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువుపై సుమారు 300 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి పొందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మురుగు, కాలుష్యం కారణంగా చెరువులో చేపలు బతకడం లేదు. దీంతో గత ఐదేండ్ల నుంచి జీవనోపాధి కోల్పోయాం. మా కుటుంబాల్లోని  పిల్లలు కూలీ పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందే ప్రోత్సాహకాలు కూడా మాకు దక్కడం లేదు.

- తలారి వీరస్వామి, 
గ్రామ మత్యకారుల సంఘం అధ్యక్షుడు 

చెరువు, పొలాలు ఆగమైనయ్​

మురుగు చేరకముందు  చెరువుతోపాటు పరిసర ప్రాంతాలు మంచిగ ఉండేవి. ఇప్పుడు పరిస్థితి అట్ల లేదు. చెరువు నాశనమై పొలాలు ఆగమైనయ్. దీనికి తోడు కెమికల్స్​  కూడా కలుస్తుండటంతో జనం రోగాల బారిన పడుతున్నరు. ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తం.

- జైపాల్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్

మా ఇంట్లో నలుగురికి డెంగీ వచ్చింది

దోమలు ఎక్కువ కావడంతో గ్రామస్తులు వ్యాధులు బారిన పడుతున్నరు. మా కుటుంబంలో నలుగురు పిల్లలుంటే వారందరికీ డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయి. మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరు.

- రామకృష్ణ,
 పసుమాముల గ్రామస్తుడు