డీసీసీ అధ్యక్షుల జాబితాలో కనిపించని సంగారెడ్డి జిల్లా

డీసీసీ అధ్యక్షుల జాబితాలో కనిపించని సంగారెడ్డి జిల్లా
  • సంగారెడ్డి ఒక్కటే ఆగింది..
  • ఎన్నారై ఉజ్వల్ రెడ్డిని అనుకున్రు.. అంతలోనే పెండింగ్
  • నారాయణఖేడ్ ప్రముఖ లీడర్లే అడ్డుపడినట్టు ప్రచారం
  • కొత్తవాళ్లు వచ్చేవరకు నిర్మలరెడ్డికే బాధ్యతలు
  • ఆసక్తికరంగా సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠం ఎంపిక

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ హై కమాండ్ రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల  డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తే అందులో  సంగారెడ్డి జిల్లా పేరు మాత్రం కనిపించలేదు. జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందా లేక పాత వారినే కొనసాగిస్తారా అనేది తెలియడంలేదు. ఉమ్మడి జిల్లాలో మెదక్, సిద్దిపేట జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి సంగారెడ్డి డీసీసీ పీఠంపై పడింది.

 మొదట్లో డీసీసీ పదవి కోసం పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. సాధారణంగా అధికార పార్టీలో  జిల్లా బాధ్యతలు చేపట్టేందుకు తీవ్ర పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ విరుద్ధ పరిస్థితులు కనిపించాయి. అధ్యక్ష పదవి కోసం జహీరాబాద్ నుంచి ఎన్నారై ఉజ్వల్ రెడ్డి మినహా సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గాల నుంచి ఎవరూ ముందుకు రాలేదు. చివర్లో సంగారెడ్డి, పటాన్ చెరు, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఇద్దరు ముగ్గురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. 

ఉజ్వల్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ మద్దతు ఉండడంతో కాంగ్రెస్ జిల్లా క్యాడర్ ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు నిర్మలరెడ్డి మరో మారు ఆ పదవిలో కొనసాగేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆమెతో సహా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఉజ్వల్ రెడ్డి పేరును బలపరిచినట్టు సమాచారం. కానీ చివరకు ఖేడ్ ప్రముఖ లీడర్లు అడ్డుపడడంతో డీసీసీ అధ్యక్షప్రకటన నిలిచిపోయినట్లు చెబుతున్నారు.

ఆ ఇద్దరు అడ్డుకోవడం వల్లే..

నారాయణఖేడ్ ప్రాంతం ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకులు ఉజ్వల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడం వల్లే సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి నిలిచిపోయింది. తాము ప్రతిపాదించిన నాయకున్ని అధ్యక్షుడిని చేయాలని హైకమాండ్​ వద్ద ఆ లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఖేడ్ నుంచి ఓ ప్రముఖ యువ నాయకుడిని డీసీసీ అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టాలని చూస్తున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.

 ప్రస్తుతం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డిని కొనసాగించినా పర్వాలేదు కానీ ఉజ్వల్ రెడ్డిని మాత్రం వద్దని వాదిస్తున్నారు. ఈ వ్యవహారం హైకమాండ్​ వద్ద తేలకపోవడంతో తాత్కాలికంగా జిల్లా అధ్యక్ష పదవిని పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తయ్యే వరకు ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఆ పదవిలో కొనసాగాలని హైకమాండ్​ ఆదేశించినట్టు తెలిసింది.