వాడూ వీడూ వంకర రాతలు రాస్తున్నరు: బాల్క సుమన్

వాడూ వీడూ వంకర రాతలు రాస్తున్నరు: బాల్క సుమన్
  • జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బాల్క సుమన్​ 

కోల్​బెల్ట్, వెలుగు: జర్నలిస్టులపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​నోరు పారేసుకున్నారు. ‘‘మీడియాలో వాడూ వీడూ వంకర రాతలు రాస్తున్నరు.. ఈ 45 రోజులు ఎవడూ అలాంటి వంకర రాతలు రాయకుండా సక్కగ జేయండి. అందుకు ఏం చేయాల్నో అది చేసి పడేయండి” అంటూ ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రెండో జోన్​లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ లీడర్ల సమావేశంలో బాల్క సుమన్​మాట్లాడారు. ‘‘ఆలోచించేది లేదు.. పార్టీ పట్టణ అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలి. అవసరం అనుకుంటే మరో ఇద్దరు ముగ్గురిని కలుపుకుని అది ఎట్ల చేస్తారో చేయండి” అంటూ జర్నలిస్టులపైకి బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 

సోషల్ మీడియాలో శనివారం ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా, ఎమ్మెల్యే తీరుపై జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మండిపడ్డాయి. నెటిజన్లు సైతం ఎమ్మెల్యే తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా చేయడం సిగ్గుచేటని ప్రతిపక్ష పార్టీల లీడర్లు మండిపడ్డారు. శనివారం జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా పొలిటికల్, ప్రెస్ గ్రూపుల్లో కామెంట్లు పెట్టారు. అలాగే మందమర్రి మార్కెట్​లోని అంబేద్కర్ విగ్రహం ముందు జర్నలిస్టులు, ప్రతిపక్ష లీడర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.