సవాల్ ​చేసిండు.. ఓడిపోయిండు

సవాల్ ​చేసిండు.. ఓడిపోయిండు

మంచిర్యాల, వెలుగు :  దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరిన చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. చివరికి ఆయన చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ‘‘చెన్నూర్​కు నువ్వేరా.. నా​మీద నువ్వే పోటీ చెయ్.. మొగోనివైతే నువ్వు అట్నుంచి పోటీ చెయ్​.. నేను ఇట్నుంచి పోటీ చేస్త’’ అంటూ బాల్క సుమన్ సవాల్ చేశారు. దీంతో చెన్నూర్ నుంచి పోటీ చేసిన వివేక్.. బాల్క సుమన్ ను చిత్తుగా ఓడించారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో  పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​నుంచి వివేక్, బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్​పోటీ చేశారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్​తో పాటు ‘నాపై వంద కేసులు ఉన్నయ్.. వివేక్​కు వందల కోట్లున్నయ్.

చెమట చుక్కుకు.. సెంటు వాసనకు పోటీ’ అంటూ బాల్క సుమన్ చేసిన ప్రచారం వర్కవుట్​అయి ఆయన గెలిచారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సీటును కబ్జా చేసిన సుమన్.. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2019 లోక్​సభ ఎన్నికల్లో వివేక్​కు బీఆర్ఎస్ టికెట్​రాకుండా బాల్క సుమన్ కుట్రలు చేసి అడ్డుకున్నారు. 

బాల్క సుమన్ కామెంట్లకు వివేక్ కౌంటర్.. 

ఈసారి ఎన్నికల్లో ‘వేల కోట్లున్న వివేక్​ను గెలిపిస్తరా? వేల కోట్లతో అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తరా?’ అంటూ బాల్క సుమన్ ప్రచారం చేశారు. అయితే ‘నాడు వంద కేసులు, రెండు జతల బట్టలు ఉన్నాయన్న సుమన్​కు నేడు వెయ్యి కోట్లు ఎట్లొచ్చాయ్? సుమన్ ల్యాండ్, సాండ్, కోల్​మాఫియా ద్వారా వేల కోట్లు అక్రమంగా సంపాదించిండు.

బాల్క సుమన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏది?’ అంటూ వివేక్ ​స్ట్రాంగ్​​ కౌంటర్ ​ఇచ్చారు. అది ప్రజల్లోకి బాగా వెళ్లింది. అంతేకాకుండా ‘సూట్​ కేసులకు అమ్ముడుపోయిన్రు’ అంటూ కాంగ్రెస్ లీడర్లను బాల్క సుమన్ తిట్టారు. ‘డిసెంబర్​3 తర్వాత కాంగ్రెస్​లీడర్ల సంగతి చెప్తాం’ అంటూ కేటీఆర్ బెదిరించారు. మరోవైపు ఎన్నికల టైమ్ లో ఎలాగైనా బద్నాం చేయాలన్న కుట్రతో వివేక్ ఇండ్లు, సంస్థలపై ఈడీ దాడులు చేయించారు. ఇవన్నీ బీఆర్ఎస్ కే రివర్స్ అయ్యాయి.