బల్కంపేట ఎల్లమ్మ లగ్గానికి వేళాయే..

బల్కంపేట ఎల్లమ్మ లగ్గానికి వేళాయే..
  • పెండ్లి కూతురుగా ముస్తాబైన అమ్మవారు
  • నేడు ఉదయం 11:51 గంటలకు అభిజిత్ లగ్నంలో ముహూర్తం
  • సోమవారం ఘనంగా జరిగిన ఎదుర్కోళ్ల ఉత్సవం
  •  భక్తులకు ఇబ్బందులు కలగకుండాపకడ్బందీ ఏర్పాట్లు

హైదరాబాద్ ​సిటీ/పద్మారావు నగర్ , వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ పెండ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 4 గంటలకు అమ్మవారిని అభిషేకించి, స్థాపిత దేవతల పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మహా విద్య చండి మూల మంత్ర అనుష్ఠానం, వేద పారాయణం జరిపి 11:51 గంటలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెండ్లి జరపనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం వేదపండితులు తొలుత గణపతి పూజ నిర్వహించారు. 

సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతలను ఆహ్వానించారు. అనంతరం ఎదుర్కోళ్ల ఉత్సవానికి భారీగా భక్తులు తరలిరాగా, అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అలాగే కల్యాణోత్సవం  సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురు చేశారు. ముఖ్య​అతిథిగా పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ హాజరయ్యారు. 

ఉత్సవాల్లో మూడో రోజైన బుధవారం రథోత్సవం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఫలహార బండ్లు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనడానికి రూ.3 వేల టికెట్​పై ఇద్దరు భక్తులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ఆర్టీసీ స్పెషల్ బస్సులు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గ్రేటర్​ ఆర్టీసీ తెలిపింది. గ్రేటర్ ​పరిధిలోని 18 డిపోల నుంచి 80 బస్సులను బల్కంపేటకు నడపనున్నారు. సనత్​నగర్, పటాన్​చెరు, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, బోరబండ, కేపీహెచ్​బీ, ఈఎస్​ఐ, జీడిమెట్ల, కూకట్​పల్లి ప్రాంతాల నుంచి ఈ బస్సులు బల్కంపేట వరకు నడపనున్నారు.

అమ్మవారికి బంగారు చీర

కల్యాణోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ సిబ్బంది సోమవారం బంగారు చీరను సమర్పించారు. వివిధ రకాల పండ్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.