బంతి వికెట్లను తాకినా లేవని జింగ్ బెయిల్స్

బంతి వికెట్లను తాకినా లేవని జింగ్ బెయిల్స్

క్రికెట్‌‌లో కొత్త ఆవిష్కరణలకు ఐసీసీ తరచూ మొగ్గు చూపుతుంది. టెక్నాలజీని వాడడంలోనూ ముందుంటుంది. కానీ, ఆ టెక్నాలజీ  కొన్నిసార్లు ఆటను రక్తికట్టిస్తే.. ఒక్కోసారి విమర్శలకు తావిస్తోంది. ఔట్ల విషయంలో స్పష్టత కోసం ప్రవేశపెట్టిన జింగ్‌‌ బెయిల్స్‌‌ టెక్నాలజీ ఇప్పుడు రెండో కోవలో నడుస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌‌ పన్నెండో సీజన్‌‌లో వివాదాస్పదమైన  జింగ్‌‌ బెయిల్స్‌‌.. వరల్డ్‌‌కప్‌‌లో  వివాదం రేపే అవకాశం కనిపిస్తోంది. బంతి వికెట్లను తాకి.. లైట్లు వెలిగినా బెయిల్స్‌‌ కదలకపోయిన ఘటనలు ఇప్పటికే మూడు సార్లు జరిగాయి.  అత్యంత కఠినమైన పోటీ ఉండి.. అతి సూక్ష్మ విషయాలు ఫలితాలను ప్రభావితం చేసే ఈవెంట్‌‌లో..  యావత్‌‌ క్రికెట్‌‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న మెగా టోర్నీలో ఈ విషయం ఇప్పుడు  సర్వత్రా చర్చనీయాంశమైంది.  టోర్నీ తొలి మ్యాచ్‌‌లోనే ఇంగ్లండ్‌‌ స్పిన్నర్‌‌ ఆదిల్‌‌ రషీద్‌‌ వేసిన బంతి  సౌతాఫ్రికా బ్యాట్స్‌‌మన్‌‌ డికాక్‌‌ను బీట్‌‌ చేసుకుంటూ వెళ్లి వికెట్లను తాకింది. లైట్‌‌ కూడా వెలిగింది.  కానీ బెయిల్స్‌‌ మాత్రం కదల్లేదు. ఇంగ్లండ్‌‌ కీపర్‌‌ బట్లర్‌‌ అప్పీల్‌‌ చేసిన డికాక్‌‌ నాటౌట్‌‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌‌తో మ్యాచ్‌‌లో  శ్రీలంక కెప్టెన్‌‌ కరుణరత్నె బ్యాటింగ్‌‌ చేస్తుండగా పేసర్‌‌ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ వేసిన బంతి కూడా స్టంప్స్‌‌ను తాకింది. కానీ, బెయిల్స్ పడకపోవడంతో కరుణరత్నె బతికిపోయాడు. దాదాపు 140 కి.మి. వేగంతో వచ్చిన బంతి వికెట్లను తాకుతూ వెళ్లినా జింగర్‌‌ బెయిల్స్‌‌లో కదలిక లేకపోవడం ఆశ్చర్యకరం. గురువారం ఆస్ట్రేలియా–వెస్టిండీస్‌‌ మ్యాచ్‌‌లోనూ సేమ్‌‌సీన్‌‌ రిపీటైంది. ఆసీస్‌‌ స్పీడ్‌‌ స్టార్‌‌ మిచెల్‌‌ స్టార్క్‌‌ విండీస్‌‌ డేంజర్‌‌మ్యాన్‌‌ క్రిస్‌‌ గేల్‌‌కు సంధించిన ఓ బంతి.. ఆఫ్‌‌ స్టంప్‌‌ పైభాగాన్ని తాకుతూ కీపర్‌‌ చేతిలో పడింది. గట్టి సౌండ్‌‌ రావడంతో బంతి.. బ్యాట్‌‌కు తగిలిందని స్టార్క్‌‌, కీపర్‌‌ అలెక్స్‌‌ కారీ క్యాచ్‌‌ కోసం అప్పీల్‌‌ చేయడం అంపైర్‌‌ వేలెత్తడం చకచకా జరిగిపోయాయి. కానీ, గేల్‌‌ రివ్యూ కోరగా.. బ్యాట్‌‌కు ఎడ్జ్‌‌ లేకపోవడంతో అతను బతికిపోయాడు. అయితే,  స్నికో మీటర్‌‌లో బంతి వికెట్లను తాకినట్టు తేలడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.   ఈ మూడు ఘటనలు మ్యాచ్‌‌ ఫలితాలపై  పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకవేళ ఉత్కంఠగా సాగే మ్యాచ్‌‌లో ఇలాంటివి జరిగి.. ఫలితంపై ప్రభావం చూపితే   పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  జింగ్‌‌ బెయిల్స్‌‌ విషయంలో పునరాలోచన చేయాలని ఐసీసీకి సూచిస్తున్నారు. కానీ,  అందుకు ఐసీసీ ససేమిరా అంటోంది. కానీ, ఐపీఎల్‌‌తో పాటు వరల్డ్‌‌కప్‌‌లో జరిగిన పరిణామాలు చూస్తే ఐసీసీ వాదనలో సహేతుకత లేదనిపిస్తోంది.  140 ప్లస్‌‌ స్పీడు బంతి తాకినా కూడా బెయిల్స్‌‌ ఏమాత్రం జరగకపోవడాన్ని కచ్చితంగా సీరియస్‌‌గా తీసుకోవాల్సిందే.

ఇదేం అంపైరింగ్‌‌ …

జింగ్‌‌ బెయిల్స్‌‌ కథే కాదు.. మెగా టోర్నీలో  చెత్త అంపైరింగ్‌‌పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌‌లో వెస్టిండీస్‌‌  ఇన్నింగ్స్‌‌లోనే ఐదుసార్లు డీఆర్‌‌ఎస్‌‌  కోరితే  నాలుగుసార్లు అంపైర్‌‌ నిర్ణయాలకు వ్యతిరేక ఫలితం రావడం గమనార్హం. గేల్‌‌ ఎల్బీగా ఔటయ్యే ముందు బాల్‌‌ను స్టార్క్‌‌ లైన్‌‌ దాటి నోబాల్‌‌ వేసినా గుర్తించలేదు. దాన్ని నోబాల్‌‌ ఇస్తే నెక్ట్స్‌‌ బాల్‌‌ ఫ్రీహిట్‌‌ అయ్యేది. కానీ, అంపైర్​ గుర్తించకపోవడంతో  గేల్‌‌ ఫ్రీహిట్‌‌ బాల్‌‌కు వికెట్‌‌ పారేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ అంపైర్‌‌ నోబాల్‌‌ గుర్తించి.. గేల్‌‌ అప్పుడే ఔటవకపోయి ఉంటే మ్యాచ్‌‌ ఫలితం వేరేలా ఉండేదేమో. అందుకే, మ్యాచ్‌‌ ముగిశాక విండీస్‌‌ బౌలర్‌‌ కార్లోస్‌‌ బ్రాత్‌‌వైట్‌‌ అంపైరింగ్‌‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనపై చర్యలు తీసుకున్నా పర్లేదు.. ఇది కచ్చితంగా చెత్త అంపైరింగ్‌‌ అనేశాడు. తాము బౌలింగ్‌‌ చేస్తుండగా.. కొన్ని బౌన్సర్లు ఎక్కువ ఎత్తులో వెళ్లకున్నా కూడా వైడ్లు ఇచ్చారని విమర్శించాడు. చాలా మంది మాజీలు కూడా అంపైరింగ్‌‌ ప్రమాణాలపై పెదవి విరుస్తున్నారు. మరి, ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.