IND vs PAK: ఓరీ మీ వేశాలో.. హాఫ్ సెంచరీకే పాక్ ఓపెనర్ గన్ సెలెబ్రేషన్.. బీసీసీపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు

IND vs PAK: ఓరీ మీ వేశాలో.. హాఫ్ సెంచరీకే పాక్ ఓపెనర్ గన్ సెలెబ్రేషన్.. బీసీసీపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 21) ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ వైరల్ గా మారుతోంది. ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్  చేసిన ఈ పాక్ ఓపెనర్ హాఫ్ సెంచరీ తర్వాత ఓవరాక్షన్ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్‌ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఫర్హాన్ తన బ్యాట్ ను గన్ లా చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. 

పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ అతని సెలెబ్రేషన్ కు తెగ చప్పట్లు కొట్టారు. ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్  పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియాపై చేసిన పహల్గామ్‌ ఎటాక్ ను గుర్తు చేసింది. ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ పై ఇండియన్ ఫ్యాన్స్ బీసీసీఐ, భారత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తానీ ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది అమాయకులను ఎలా ఊచకోత కోశారో సాహిబ్‌జాదా ఫర్హాన్ మైదానంలో చూపిస్తున్నడంటూ ట్వీట్స్ పెడుతున్నారు. "హాఫ్ సెంచరీ తర్వాత AK-47 లాగా బ్యాట్‌ను పట్టుకుని, బౌండరీలు పేల్చాడు. 

బీసీసీఐ, మోడీ ప్రభుత్వం ఈ సంఘటనకు సిగ్గుపడాలి అని మరికొందరు అంటున్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ ఇండియాకు అవమానకరం అని.. దేశం సిగ్గుపడేలా  చేసినందుకు జై షా భారతరత్నకు అర్హుడని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఫర్హాన్ 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) హాఫ్ సెంచరీకి తోడు మిగిలిన వారు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.