గడ్డపార దిగిన పాముకు ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్.. మొత్తానికి బ్రతికించాడు.. సిరిసిల్లలో ఘటన

గడ్డపార దిగిన పాముకు ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్.. మొత్తానికి బ్రతికించాడు.. సిరిసిల్లలో ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ వెటర్నరీ డాక్టర్ అభిలాష్  పాముకు ట్రీట్మెంట్ చేసి బ్రతికించాడు. సిరిసిల్ల ప్రాంతంలో కాటిపాపల వారు పెంచుకుంటున్న  మన్నుగున్న పాముపై అనుకోకుండా గడ్డ పార పడడంతో ఆ పాము తీవ్రంగా గాయపడింది. వెంటనే పశువైద్య డాక్టర్ అభిలాష్ను సంపద్రించగా వారు మూడు రోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు. పాము కోలుకున్నట్లు డాక్టర్ చెప్పారు. తెలంగాణలో ఇలా పాముకు చికిత్స చేసిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి.

2023లో గాయపడిన పాముకు ఒక వెటర్నరీ డాక్టర్ చికిత్స అందించింది. గాయాలైన చోట అచ్చం మనిషికి చేసినట్టే కుట్టు వేసి.. బ్యాండేజీ వేసింది. పాముకు రెస్ట్ కావాలని.. అది కోలుకున్న తర్వాత తిరిగి దాన్ని అడవిలో వదిలేస్తానని తెలిపింది. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. కరీంనగర్ పట్టణంలోని కమాన్ ప్రాంతంలో ఓ పాము గాయాలతో పడి ఉన్నట్లు జంతువుల నిర్వాహకురాలు  శ్రీ లక్ష్మికి సమాచారం అందింది. ఆ పామును జంతు సంరక్షణ సిబ్బంది కరీంనగర్ పశువైద్యశాలలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. గాయపడిన పాముకు వైద్యులు కుట్లు వేశారు. పాము కోలుకున్న తర్వాత దాన్ని అడవిలో వదిలేశారు.

బుసలు కొడుతూ భయపెట్టే పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతుంటాం. అలాంటి పామును కూడా మన లాంటి ప్రాణిగానే భావించి వైద్యం చేయడం చిన్న విషయం కాదు. పాము అయినా, మరే జీవి అయినా మనిషికి కావాలని హాని చేయదు. వాటిని ఏమైనా చేస్తామేమోనన్న భయంతో ఆత్మ రక్షణలో భాగంగా అవి మనుషులపై దాడి చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో పాము అల్లంత దూరంలో దాని మానాన అది వెళుతుంటుంది. దాని వైపు మనం వెళితేనే కాటు వేయడానికి మీదకొస్తుంది.