IND vs PAK: నాటౌట్ అయినా ఔటిచ్చారు.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఫకర్ జమాన్ బలి

IND vs PAK: నాటౌట్ అయినా ఔటిచ్చారు.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఫకర్ జమాన్ బలి

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అంపైర్ వివాదాస్పద నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఆదివారం (సెప్టెంబర్ 21) పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వచ్చారు. తొలి రెండు ఓవర్లో 17 పరుగులు రాబట్టి పర్వాలేదనిపించిన పాక్ మూడో ఓవర్లో ఫకర్ జమాన్ వికెట్ కోల్పోయింది. అయితే రీప్లేలో ఫకర్ నాటౌట్ అయినట్టుగా అర్ధమవుతోంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని పాండ్య ఆఫ్ సైడ్ దూరంగా బంతిని విసిరాడు. 

దూరంగా వెళ్తున్న బంతిని ఫకర్ జమాన్ కట్ చేయబోతే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలో పడింది. బంతి వికెట్ కీపర్ వద్దకు తక్కువ ఎత్తులో వెళ్లడంతో శాంసన్ క్యాచ్‌ను పట్టుకోవడానికి ముందుకు డైవ్ చేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ను సంప్రదించాడు. రీప్లేలో బంతి స్పష్టంగా నేలను తాకినట్టు కనిపించినా థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ గా ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫకర్ జమాన్ ఔట్ పై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ ప్లేయర్లు, ఫ్యాన్స్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఫకర్ జమాన్ ఔటవ్వడంతో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 9 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఈ పాక్ ఓపెనర్ అంపైర్ నిర్ణయానికి షాక్ అయ్యి నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) హాఫ్ సెంచరీకి తోడు మిగిలిన వారు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా ముందు ఒక మాదిరి టార్గెట్ ను సెట్ చేసిన పాక్.. బౌలింగ్ లో ఎంతవరకు పోరాడుతుందో చూడాలి. ఇండియా బౌలర్లలో శివమ్ దూబే రెండు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.