ఎయిర్ బేస్ కాదు కదా.. ఇంచ్ భూమి కూడా ఇవ్వం: ట్రంప్‎కు తెగేసిచెప్పిన తాలిబన్ విదేశాంగ మంత్రి

ఎయిర్ బేస్ కాదు కదా.. ఇంచ్ భూమి కూడా ఇవ్వం: ట్రంప్‎కు తెగేసిచెప్పిన తాలిబన్ విదేశాంగ మంత్రి

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు పాల్పడటంపై తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎయిర్ బేస్ కాదు కదా.. ఆప్ఘానిస్తాన్‎లో ఇంచ్ భూమి కూడా ఇవ్వమని ట్రంప్‎కు తెగేసి చెప్పాడు . టోలో న్యూస్‎కు అమీర్ ముత్తాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా బాగ్రామ్ ఎయిర్ బేస్‎ను తిరిగి ఇవ్వాలంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడటంపై ఆయన స్పందించారు. బాగ్రామ్ ఎయిర్ బేస్‎ను తిరిగి ఇవ్వాలనే ట్రంప్ ప్రతిపాదనను ముత్తాకి తీవ్రంగా ఖండించారు. ఆప్ఘానిస్తాన్‎లో ఇంచు భూమి కూడా వదులుకోబోమని స్పష్టం చేశాడు. 

ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. తాలిబన్లు, వాషింగ్టన్ మధ్య 2020 ఫిబ్రవరిలో ఖతార్‌ వేదికగా కుదిరిన దోహా ఒప్పందాన్ని గౌరవించాలని ఆయన ట్రంప్‎కు సూచించారు. దోహా ఒప్పందం ఏంటంటే.. ఆఫ్ఘనిస్తాన్  ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం చేయబోమని లేదా బెదిరించబోమని అమెరికా హామీ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ పరస్పర భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా అన్ని దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 

2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్‌ సిటీలపై అల్-ఖైదా ఉగ్రదాడులకు పాల్పడిన తర్వాత ఆప్ఘనిస్తాన్‎లోని బాగ్రామ్ ఎయిర్ బేస్‎ను ప్రధాన స్థావరంగా చేసుకుని ఉగ్రవాదంపై యూఎస్ యుద్ధం చేసింది. అయితే, 2021లో అమెరికా దళాలు ఆప్ఘాన్‎ను విడిచి తిరిగి యూఎస్ వెళ్లిపోయాయి. ఈ సమయంలో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి 64 కి.మీ దూరంలో ఉన్న ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్‎ను తాలిబన్లకు అప్పగించింది. 

అయితే, ఇటీవల ఆప్ఘాన్‎లోని తాలిబన్ ప్రభుత్వం చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. తమ శత్రు దేశం చైనాతో తాలిబన్లు చేయి కలపడంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్‎ను తిరిగి తమకు అప్పగించాలని తాలిబన్లను బెదిరిస్తున్నారు ట్రంప్. ఎయిర్ బేస్ తిరిగి ఇవ్వకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని తాలిబన్లను బయపెడుతున్నారు. అయితే.. ట్రంప్ బెదిరింపులను తాలిబన్లు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఎయిర్ బేస్ కాదు కదా.. తమ దేశంలో ఇంచు భూమిని కూడా వదులుకోబోమని అమెరికాకు సూటిగా చెబుతున్నారు. తిరిగి అమెరికాను తమ దేశంలో అడుగుపెట్టనివ్వబోమని తేల్చి చెబుతున్నారు.