అమెరికా, జపాన్‌లకు చైనా హెచ్చరిక: తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు, డ్రోన్లతో మిలిటరీ డ్రిల్..

అమెరికా, జపాన్‌లకు చైనా హెచ్చరిక: తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు, డ్రోన్లతో మిలిటరీ డ్రిల్..

తైవాన్ మా దేశంలో భాగమేనని వాదించే చైనా ఇప్పుడు  తైవాన్ చుట్టూ భారీ స్థాయిలో లైవ్-ఫైర్ అంటే నిజమైన ఆయుధాలతో సైనిక విన్యాసాలు మొదలుపెట్టింది. ఈ చర్య అమెరికా, జపాన్ దేశాలకు ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 అయితే చైనాకు చెందిన పిలుపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఈ రోజు (29 సోమవారం)  తైవాన్ సముద్ర తీర ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, బాంబర్లు సహా డ్రోన్లతో విన్యాసాలు చేపట్టింది. దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను క్షిపణులతో ఎలా కూల్చివేయాలో ఈ డ్రిల్స్ ద్వారా చైనా సైన్యం ప్రాక్టీస్ చేస్తోంది.

ఈ పరిస్థితులకు ముఖ్య కారణం అమెరికా. తైవాన్ రక్షణ కోసం అమెరికా దాదాపు 11.1 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 92 వేల కోట్ల విలువైన ఆయుధాలను అమ్మడానికి ఒప్పుకుంది. ఇది తైవాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం.

 అమెరికా చేస్తున్న పని వల్ల తైవాన్‌లో అశాంతి పెరుగుతుంది. తైవాన్‌ను విడగొట్టాలని చూసే వారికి అమెరికా సపోర్ట్  చేస్తోంది. మా దేశ భద్రత కోసం మేము ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడం అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ డిసెంబర్ 18న జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.

జపాన్ కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతోంది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే అది మా దేశ ఉనికికే ప్రమాదమని జపాన్ ప్రధాని సనే తకైచి గతంలోనే హెచ్చరించారు. అవసరమైతే అమెరికాకు తోడుగా నిలబడతామని కూడా చెప్పారు.

దీనిపై చైనా మండిపడుతోంది. జపాన్ తన సైనిక శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి కారణాలు వెతుక్కుంటోందని, ఒకినావాలో జపాన్ సైన్యాన్ని మోహరించడం సరికాదని చైనా విమర్శిస్తోంది.