హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజల స్వేచ్ఛను హరించిన నీచ చరిత్ర కల్వకుంట్ల ఫ్యామిలీదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నా రు. ఫోన్ ట్యాపింగ్‌లో కల్వకుంట్ల ఫ్యామిలీ పాత్ర లేకుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. శనివారం తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభ కు విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులు, నిరుద్యో గులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చి న్యాయం చేశామన్నారు. ఈ నెల 8 నుంచి 19 వరకు మేనిఫెస్టోను రోజుకు 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ప్రజల్లో కి తీసుకెళ్తామని తెలిపారు. డీఎస్సీ పరీక్షకు ఫీజును మాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి అయ్యేందుకే పలువురు నేతలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారని వెంకట్ అన్నారు.