బలూచ్ పోరాటం ఉధృతం!

బలూచ్ పోరాటం ఉధృతం!
  • తిరుగుబాటు ఉద్యమం తీవ్రం చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 
  • పాక్ సైన్యం, స్థావరాలు లక్ష్యంగా అటాక్స్
  • ఐఈడీలు, గ్రనేడ్లతో దాడులు 
  • పాక్ ఆర్మీ అధీనంలోని పలు ప్రాంతాలు స్వాధీనం  
  • భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలే అవకాశంగా బీఎల్‌‌ఏ వ్యూహాత్మక దాడులు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)... పాక్‌‌ సైన్యంపై దాడులను తీవ్రం చేసింది. భారత్‌‌, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బీఎల్‌‌ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్‌‌లో పాక్‌‌ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నది. పాక్ మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో మనతో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్.. ఓవైపు మన ఆర్మీ చేస్తున్న దాడులు, మరోవైపు బీఎల్‌‌ఏ చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. 

తిరుగుబాటు ఉధృతం.. 

భారత్‌‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత బలూచ్ తిరుగుబాటుదారులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. భారత్‌‌పై దాడులు చేయడంలో బిజీగా ఉన్న పాక్ ఆర్మీని అదనుచూసి దెబ్బతీస్తున్నారు. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

 గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటాక్స్ చేశారు. బీఎల్‌‌ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీవోఎస్) ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్‌‌‌‌లో పాక్ ఆర్మీ వెహికల్‌‌ను ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. 

ఈ దాడిలో 20 మంది వరకు సైనికులు మరణించినట్టు బీఎల్‌‌ఏ పేర్కొంది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ మిలటరీ కాన్వాయ్‌‌పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌‌పైనా ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక సైనికుడు మరణించినట్టు వెల్లడించింది.

బీఎల్‌‌ఏ చేతుల్లోకి క్వెట్టా! 

బలూచిస్తాన్‌‌ తిరుగుబాటు పోరాటాన్ని అణచివేసేందుకు పాక్ పెద్ద ఎత్తున సైన్యాన్ని అక్కడ మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బీఎల్‌‌ఏ దాడులు చేస్తూ, ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి.. ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్‌‌క్వార్టర్స్‌‌తో పాటు కీలకమైన చెక్‌‌ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌‌ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. 

కాగా, బలూచిస్తాన్‌‌లోని 39 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు బీఎల్‌‌ఏ శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని బీఎల్‌‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తెలిపారు.

మార్చిలో రైలు హైజాక్‌‌.. 

ఈ ఏడాది మార్చిలో జరిగిన రైలు హైజాక్‌‌ ఘటనతో బలూచిస్తాన్ తిరుగుబాటు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. అప్పటి వరకు చిన్నాచితక దాడులకు పాల్పడిన బీఎల్‌‌ఏ.. ఏకంగా రైలును హైజాక్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఏడాది మార్చి 11న 400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌‌‌‌కు వెళ్తున్న జఫర్ ఎక్స్‌‌ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బీఎల్‌‌ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే ప్రయాణికులను చంపుతామని పాక్​ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ‘ఆపరేషన్ గ్రీన్ బోలన్’ చేపట్టి ప్రయాణికులను విడిపించింది. ఈ ఆపరేషన్‌‌లో 33 మంది బీఎల్‌‌ఏ తిరుగుబాటుదారులు, 21 మంది దాకా ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారు. 

దశాబ్దాలుగా పోరాటం.. 

పాకిస్తాన్‌‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దేశ విస్తీర్ణంలో 44శాతం ఒక్క బలూచిస్తాన్‌‌లోనే ఉంది. అపారమైన ఖనిజాలు, వనరులు బలూచిస్తాన్ సొంతం. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. తమ వనరులను దోచుకుంటూ, తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే తిరుగుబాటుకు కారణమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది.

అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్‌‌లో చేరేందుకు ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు జరిగింది. ఇక 2000 సంవత్సరంలో బీఎల్‌‌ఏ ఏర్పాటు తర్వాత పోరాటం మరింత తీవ్రమైంది.