60 రోజుల్లో 140 లక్షల టన్నుల బొగ్గు తీయాలి : బలరాం నాయక్

60 రోజుల్లో 140 లక్షల టన్నుల బొగ్గు తీయాలి : బలరాం నాయక్

కోల్​బెల్ట్, వెలుగు:  నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరం టార్గెట్(70మిలియన్​టన్నులు) చేరుకోవడానికి 60 రోజుల్లో 140 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆయన సింగరేణి భవన్​నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. రోజుకు కనీసం 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా ఉత్పత్తి చేస్తే నిర్దేశించుకున్న టార్గెట్​చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి, రవాణా ఆశాజనకంగా ఉందని, మొదటి 10  నెలల కాలంలో 56.7 మిలియన్​టన్నుల బొగ్గు టార్గెట్ కు గానూ.. 56.3 మిలియన్ టన్నులు సాధించినట్లు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు.

57.23 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు. రవాణా పరంగా గతేడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి ఉందన్నారు. 344 మిలియన్​క్యూబిక్​మీటర్ల ఓవర్ బర్డెన్​తొలగించామని, 60 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి రోజుకు 15.6లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​బర్డెన్​ను తొలగించాల్సి ఉందన్నారు. 

కొత్త గనుల పర్మిషన్లపై దృష్టి పెట్టాలె

భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా ఏరియాల జీఎంలను సీఎండీ బలరాంనాయక్​ఆదేశించారు. ఓవర్ బర్డెన్ తొలగింపునకు కాంట్రాక్టర్లు సరిపడా యంత్రాలను అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్, కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీ, ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ గని ప్రారంభానికి కావాల్సిన అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

19.80 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రామగుండం-3 ఏరియాలోని ఆర్జీ కోల్ మైన్, బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీకి సంబంధించి అనుమతుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అన్ని థర్మల్ కేంద్రాలకు తగినంతగా బొగ్గు రవాణా చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణ(ఈఎం), ఎన్.వి.కె.శ్రీనివాస్​(ఆపరేషన్స్, పా), జి.వెంకటేశ్వర్​రెడ్డి(పీపీ), ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​(కోల్​మూమోంట్​) జె.అల్విన్, జీఎంలు ఎం.సురేశ్, జక్కం రమేశ్, జి.దేవేందర్​తదితరులు పాల్గొన్నారు.​