200 మంది టెర్రరిస్టుల్ని ఎదుర్కొని శౌర్య చక్ర అందుకున్న అ‘సామాన్యుడు‘: దుండగుల కాల్పుల్లో మృతి

200 మంది టెర్రరిస్టుల్ని ఎదుర్కొని శౌర్య చక్ర అందుకున్న అ‘సామాన్యుడు‘: దుండగుల కాల్పుల్లో మృతి

ఆర్మీ వీర జవాన్లకు మాత్రమే మాత్రమే ఇచ్చి శౌర్య చక్ర పతాకాన్ని సొంతం చేసుకున్న సామాన్యుడు.. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలిచి.. ప్రజలకు పోరాటాన్ని నేర్పిన వీరుడు బల్వీందర్ సింగ్ సంధూ (62)ను ఆయన స్థాపించిన స్కూల్ దగ్గర శుక్రవారం ఉదయం ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. టెర్రరిస్టులపై ఆయన పోరాటం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఉగ్రమూకలు ఆయన్ని చంపడానికి 11 నెలల గ్యాప్‌లో 16 సార్లు అటాక్ చేసినా వాటన్నింటినీ ధీరుడిలా ఎదుర్కొన్నారాయన. వందల మంది టెర్రరిస్టులు ఇంటిని చుట్టుముట్టి చంపాలని ప్రయత్నం చేసినా ఏమాత్రం జంకు లేకుండా పోరాడి వాళ్లను తోకముడిచేలా చేసిన వీరుడు బల్వీందర్ సింగ్. ఆయన ధీరత్వానికి ఫిదా అయిన భారత ప్రభుత్వం తొలిసారి 1993లో ఒక సామాన్యుడికి శౌర్య చక్ర పతకాన్ని ఇచ్చి గౌరవించింది. టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్న ఆయనకు ఎప్పటి నుంచో ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తోంది. అయితే గత ఏడాదిలో పంజాబ్ ప్రభుత్వం ఆయనకు భద్రతను తొలగించింది. దీంతో ఆయనపై అటాక్ చేయడం దుండగులకు ఈజీగా మారింది. బల్వీందర్ నడుపుతున్న స్కూల్ దగ్గరకే వెళ్లి గేటు బయట మాటు వేసి మరీ.. ఆయన అడుగు పెట్టగానే తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పలు జరిపి పరారయ్యారు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు తెలపారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

200 మంది తుపాకులతో వచ్చినా..

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా భిఖివిండ్ గ్రామంలో 62 ఏళ్ల క్రితం పుట్టిన బల్విందర్ సింగ్ చిన్ననాటి నుంచే చెడును సహించకూడదన్న సిద్ధాంతంతో పెరిగారు. 1980, 90ల్లో పంజాబ్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ పేరిట కొన్ని ఉగ్రవాద గ్రూపులు ఏర్పడడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడేందుకు యుద్ధకళల్లో గ్రామస్థులకు ఆయన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి టెర్రరిస్టులు ఆయనను హిట్ లిస్టులో చేర్చారని, అయినా ఆయన బెదరకుండా తన పోరాటాన్ని కొనసాగించారని ‘శౌర్య చక్ర’ హానర్ నోట్‌లో కేంద్రప్రభుత్వం తెలిపింది. ఆయనపై జరిగిన టెర్రరిస్టు దాడులు, వాటిని ఆయన వాటిని ఎదుర్కొన్న తీరు గురించి ఆ నోట్‌లో వివరంగా ఉంది. ఆయన పోరాట పటిమకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. గతంలో నేషనల్ జీయోగ్రఫీ చానల్ ఆయనపై డాక్యుమెంటరీ కూడా చేసింది.

పంజాబ్‌లో సిక్కు యువత ఖలిస్థాన్ ఉగ్రవాదుల వైపు ఆకర్షితులు కాకుండా బల్వీందర్ సింగ్ పోరాడిన వీరుడు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా తమ్ముడు, భార్య, పిల్లలతో సహా కుటుంబం మొత్తానికి శిక్షణ ఇచ్చారాయన. తుపాకులు లాంటి ఆయుధాలను వాడడం కూడా నేర్పించారు. ఆ తర్వాత తన గ్రామంలో యువతను ఒక చోటుకు చేర్చి ఆయన కుటుంబమంతా కలిసి ఉగ్రవాదులపై పోరాడేందుకు శిక్షణను ఇచ్చేవారు. దీంతో ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఆయన టార్గెట్‌గా మారారు. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని హిట్ లిస్టులో చేర్చారు టెర్రరిస్టులు. అయినా భయం లేకుండా ముందుకు సాగింది ఆ కుటుంబం. టెర్రిరిస్టుల నుంచి ముప్పు ఉండడంతో ఆ ఫ్యామిలీ మొత్తానికి ప్రభుత్వం ఆయుధాలు ఇచ్చింది. 1990 జనవరి 31 నుంచి 1991 డిసెంబరు 28 మధ్య కేవలం 11 నెలల గ్యాప్‌లో 16 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. ప్రతి సారి పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అటాక్ చేసేవాళ్లు.. బల్వీందర్, ఆయన కుటుంబం ప్రతిసారీ ఉగ్రవాదులను మట్టుబెట్టడమో, తరమికొట్టడమో చేస్తూ వచ్చారు. 1991 సెప్టెంబర్ 30న ఆయనపై అతిపెద్ద అటాక్ జరిగింది. ఆ రోజు ఏకంగా 200 మంది టెర్రరిస్టులు పక్కా ప్లాన్‌తో ఊరిలోకి వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేసి ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు రాకుండా ఊరి ఎంట్రెన్స్ దగ్గర కొంత మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఎలాగైనా వాళ్లను చంపాలని అటాక్ స్టార్ట్ చేశారు. వాళ్లు కాల్పులు మొదలుపెట్టడంతో ఇంట్లో ఉన్న బల్వీందర్, ఆయన తమ్ముడు, వారి భార్యలు సైతం ఏ మాత్రం జంకు లేకుండా ఎదురు కాల్పులకు దిగారు. వెనుకడుగు వేయకుండా పిస్టల్స్, స్టెన్ గన్స్‌తోనే రాకెట్ లాంచర్లు, మెషీన్ గన్లతో వచ్చిన టెర్రరిస్టులను తోకముడిచి పారిపోయేలా చేశారు. అంతటి వీరోచిత పోరాటం చేసిన బల్వీందర్ సింగ్‌కు రక్షణ శాఖ 1993లో శౌర్య చక్ర పతకం ఇచ్చి గౌరవించింది. అయితే ఆ తర్వాత కూడా టెర్రర్ హిట్ లిస్టులో ఉన్న ఆయన కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ వచ్చింది. అయితే గత ఏడాదిలో తరన్ తారన్ జిల్లా పోలీసులు భద్రత కొనసాగించాల్సిన అవసరం లేదని రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం తొలగించింది.