బేగమ్స్‌‌పై బ్యాన్‌‌ తప్పదా?

బేగమ్స్‌‌పై బ్యాన్‌‌ తప్పదా?

ఓపెన్‌‌గా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఫిల్మ్ మేకర్స్‌‌ చేసే ప్రయోగాలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ‘బాంబే బేగమ్స్’ విషయంలో అదే జరిగింది. కాకపోతే కాస్త ఆలస్యంగా నిప్పు రాజుకుంది. ఈ ఆరు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ మార్చ్‌‌ 8న నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌‌కి వచ్చింది. మహేష్‌‌ భట్ కూతురు, నటి, నిర్మాత అయిన పూజా భట్‌‌ చాలాకాలం తర్వాత ఇందులో నటించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. రాహుల్‌‌ బోస్, షహనా గోస్వామి, అమృతా సుభాష్, ప్లబిత, ఆద్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అలంకృత శ్రీవాస్తవ, బోర్నిలా చటర్జీ దర్శకత్వం వహించారు. ఐదుగురు మహిళల చుట్టూ తిరిగే కథ. వారి కలలు, కలతలు, ఆశలు, ఆరాటాలు, కుట్రలు, పోరాటాల సమాహారమే ఈ సిరీస్. అయితే మైనర్‌‌‌‌ పిల్లలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండటంతో గొడవ మొదలైంది. చైల్డ్ సెక్స్ అబ్యూజ్‌‌ని, డ్రగ్ అబ్యూజ్‌‌ని ప్రమోట్ చేస్తున్న ఈ సిరీస్‌‌ని బ్యాన్ చేయమంటూ పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. జువైనల్ జస్టిస్ యాక్ట్‌‌ 2015లోని 77వ ఆర్టికల్‌‌ని ఈ సిరీస్ వయొలేట్ చేస్తోందని, ఇలాంటి కంటెంట్ పిల్లలపై చాలా చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి వెంటనే స్ట్రీమింగ్​ ఆపేయాలని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్​కాస్టింగ్‌‌ మినిస్ట్రీతో పాటు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్‌‌‌‌కి, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌‌కి కూడా రీసెంట్‌‌గా లేఖలు అందాయి. ఈ సిరీస్ తీసినవారిపై కేసు నమోదు చేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాంతో చిన్నగా మొదలైన కాంట్రవర్శీ ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? 
బేగమ్స్‌‌ని బ్యాన్ చేస్తుందా? వేచి చూడాల్సిందే.