V6 News

World No Tobacco day May 31 : పొగాకు ఉత్పత్తులను అరికట్టాలి

World No Tobacco day May 31 : పొగాకు ఉత్పత్తులను అరికట్టాలి

ప్రతి సంవత్సరం మే 31న  ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ నో టొబాకో డే' నిర్వహించడం జరుగుతోంది. ఇది  డబ్ల్యూహెచ్​ఓ ప్రేరణతో 1987 నుంచి ప్రారంభమైంది.  పొగాకు వాడకం వల్ల వ్యక్తిగత ఆరోగ్యమే కాదు,  సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ,  వైద్యరంగాలపై పడుతున్న భారం గురించి అవగాహన కల్పించడమే వరల్డ్ నో టొబాకో డే ప్రధాన లక్ష్యం.  ఈ ఏడాది చిన్నవయసు వారికి  పొగ అలవాటును మాన్పించే ఉద్దేశంతో  ప్రపంచవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.  

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 80 లక్షల మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తుంటే,  12 కోట్ల మంది పరోక్షంగా పాసివ్ స్మోకింగ్ వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  భారతదేశంలో పొగాకు ద్వారా ప్రతి సంవత్సరం 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే,  భారత ఆర్థిక వ్యవస్థకు  పొగాకు ద్వారా సంవత్సరానికి రూ.22,000 కోట్ల వరకు పన్నులు,  రూ.6,500 కోట్లు ఎగుమతి ఆదాయం లభిస్తోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 రిపోర్టు ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది చిన్నపిల్లలు (5–17 ఏళ్ల వయసు) ప్రతిరోజూ పాసివ్ స్మోకింగ్ కు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి 10 కుటుంబాల్లో 4 కుటుంబాల్లోని చిన్నపిల్లలు పొగాకు పొగ కారణంగా తీవ్ర అనారోగ్య  సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

తెలంగాణలో  5–14 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారుగా 7% చిన్నపిల్లలు బీడీ పొగ లేదా పాసివ్ స్మోకింగ్​కి గురవుతున్నారు.   కాగా, 50 లక్షల మంది భారతదేశంలో బీడీ తయారీతో జీవితం గడుపున్నారు.  పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు  ప్రభుత్వం,   సమాజం సమష్టిగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం ఇవ్వాలి.   ప్రభుత్వ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌‌‌‌‌‌‌‌లు, డీ-అడిక్షన్ కేంద్రాల స్థాపన, పిల్లలకు స్నేహశీల అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలి. 

- ‌‌డా. బి. కేశవులు, ఎండి. సైకియాట్రీ-