బనకచర్ల కట్టనియ్యం.. హరీశ్‌‌‌‌రావు అబద్ధాలు ఆపాలి: ఉత్తమ్

బనకచర్ల కట్టనియ్యం.. హరీశ్‌‌‌‌రావు అబద్ధాలు ఆపాలి: ఉత్తమ్
  • ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునూ వ్యతిరేకిస్తున్నం
  •     బీఆర్‍ఎస్‍ హయాంలోనే గోదావరి, 
  • కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం 
  •     తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి 


  వరంగల్‍, వెలుగు: ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని, దాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్‍ఎస్‍ నేత హరీశ్‌‌‌‌రావు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని, ఆయన ఇకనైనా అబద్ధాలు చెప్పడం ఆపాలని అన్నారు. వరంగల్‍ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతి చెందగా.. శనివారం ఆయనను మంత్రులు ఉత్తమ్, సీతక్క పరామర్శించారు. 

అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్టుగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బనకచర్లను ఆపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‍ పాటిల్‌‌‌‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు లేఖ కూడా రాసినట్టు వెల్లడించారు. 

కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును కూడా తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ‘‘మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునే చిత్తశుద్ధి మాకు ఉంది. కర్నాటకలో కాంగ్రెస్‍, ఆంధ్రాలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా.. కృష్టా, గోదావరిలో మన హక్కులు కాపాడుకోవడానికి కేంద్రం, ట్రిబ్యునల్‍, సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాం” అని తెలిపారు. 

అన్యాయం చేసిందే బీఆర్ఎస్.. 

పదేండ్ల బీఆర్‍ఎస్‍ పాలనలోనే గోదావరి, కృష్ణా జలా ల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆనాడు  811 టీఎంసీల కృష్ణా జలా ల్లో ఏపీకి 512 టీఎంసీలు అప్పజెప్పి, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని బీఆర్‍ఎస్‍ సర్కార్ లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక ఆ అన్యాయాన్ని సరిచేస్తున్నాం. 811 టీఎంసీల్లో 70 శాతం తెలంగాణకు కేటాయించాలని ట్రిబ్యునల్‌‌‌‌లో వాదించాం. 

కృష్ణా జలాల్లోని 1,005 టీఎంసీల్లో 734 టీఎంసీలు తెలంగాణకే రావాలని వాదనలు వినిపించాం” అని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చెప్పారు. సీతారామసాగర్‍ ప్రాజెక్టుకు 67 టీఎంసీల కేటాయింపులు తీసుకువచ్చామని, సమ్మక్క సారక్క బ్యారేజీకి 47 టీఎంసీల కోసం కేంద్రాన్ని ఒప్పించామని, త్వరలోనే కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. 

కాళేశ్వరం లేకున్నా సాగులో రికార్డు.. 

గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని.. అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలకు బొక్కలు పడ్డాయని ఉత్తమ్ అన్నా రు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకున్నా దేశంలోనే మనం రికార్డు స్థాయిలో వడ్లు పండించినట్టు చెప్పారు. ఈ వానాకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 80 లక్షల టన్నులు ప్రభుత్వమే కొంటుందని వెల్లడించారు.

 ఉమ్మడి వరంగల్‌‌‌‌లో దేవాదులతో పాటు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీ బలరాం నాయక్‍, ఎమ్మెల్యేలు కేఆర్‍ నాగరాజు, రామచంద్రునాయక్‍, కార్పొరేషన్ల చైర్మన్లు జంగా రాఘ వరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

80 లక్షల టన్నుల వడ్లు కొంటం: ఉత్తమ్ 

యాదాద్రి, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో 80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌లో శనివారం రాత్రి వడ్ల కొనుగోళ్లు, పెండింగ్​ ప్రాజెక్టులపై ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కామారెడ్డి, నిజమాబాద్, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో 1,205  కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు.

 ‘‘ఈసారి వడ్ల దిగుబడి ఎక్కువగా వస్తున్నందున గోదాముల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే సీఎంఆర్​ సప్లయ్​ కోసం ప్రతి నెల 300 రేక్‌‌‌‌లు పంపించాలని కేంద్రాన్ని కోరాం” అని వెల్లడించారు. ‘‘భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. భూసేకరణ సర్వే, నోటీసులు, అవార్డు తదితర అంశాలను పూర్తి చేస్తే చెల్లింపులు స్పీడప్​చేస్తాం. బస్వాపు రం, గంధమల్ల, బునాదిగాని కాల్వ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన చెల్లింపుల వివరాలను పంపిం చండి” అని అధికారులను ఆదేశించారు. మీటింగ్‌‌‌‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​రెడ్డి, మందుల సామేల్, కలెక్టర్​హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.