తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతర సమీపిస్తుండడంతో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. సోమవారం వన దేవతలను కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో అధికారులు, గుత్తేదారులను అభివృద్ధి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26 లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆదివాసి గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించకుండా నామమాత్రపు నిధులను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు. అనంతరం ఆలయ సంప్రదాయ ప్రకారం ఎండోమెంట్ అధికారులు పూజారులు వారికి కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమ్మక్క పూజారి రాణా రమేశ్, ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
