ఈటల ప్రధాన అనుచరునికి ఎస్సీకార్పొరేషన్ ఛైర్మన్ పదవి

ఈటల ప్రధాన అనుచరునికి ఎస్సీకార్పొరేషన్ ఛైర్మన్ పదవి

హుజురాబాద్ బైపోల్ సెంట్రిక్ గా మరో నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ కు చెందిన బండా శ్రీనివాస్ ను  రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు కేసీఆర్. ఈటల రాజేందర్ ఎఫెక్ట్ తోనే మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ను భర్తీ చేశారు సీఎం. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు ప్రధాన అనుచరునిగా  బండా శ్రీనివాస్ కు గుర్తింపు ఉంది. మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేసిన తర్వాత కూడా ఈటలను కలిసిన శ్రీనివాస్. ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ లోనే కొనసాగేలా చూస్తానని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత ఈటలను వదిలి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్, విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రేస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ ప్లేయర్ గా రాణించిన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడుగా, ప్రస్థుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నారు.  హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గానూ, జిల్లా టెలికాం బోర్డు మెంబర్ గానూ బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు.