- 102 ఎకరాల భూమి రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా
హైదరాబాద్, వెలుగు: వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ భూమిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సమర్థిస్తూనే.. గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ రోహిత్ గోపిడి ఒక ప్రకటనలో తెలిపారు. మూడ్రోజుల పాటు సాగిన విచారణ అనంతరం, సర్వే నం.201/1లో ఉన్న సుమారు 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమేనని, రాష్ట్ర ప్రభుత్వ అటవీ భూమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేటు హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా లేవని కోర్టు తేల్చిచెప్పింది. అటవీ భూములు జాతీయ సంపదని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ, 51ఏ(జి) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని పేర్కొంది. అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీ శాఖకు మరింత బలం చేకూరిందని రోహిత్ గోపిడి పేర్కొన్నారు.
అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇది మద్దతుగా నిలిచిందన్నారు. కాగా, ఈ భూముల మార్కెట్ విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో రాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, జస్టిస్(రిటైర్డ్) చల్లా కోదండరాం, అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్‌రికార్డ్ కర్ణం శ్రావణ్ కుమార్‌కు అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ అటవీ అధికారులు, రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అనేక ఏండ్లుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక తీర్పు సాధ్యమైందని పేర్కొంది.
