హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట సుమారు 300 కోట్ల మోసానికి పాల్పడింది జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీ. ఇటీవల ఈ సంస్థలో సోదాలు నిర్వహిచిన ఈడీ అధికారులు భారీగా స్కాం జరిగినట్లు గుర్తించారు. శుక్రవారం ( డిసెంబర్ 19 ) సంస్థ ఎండీ కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. శ్రీనివాస్ ను చెన్నైలో అరెస్ట్ చేసిన హైదరాబాద్‌కు తరలించారు ఈడీ అధికారులు.
ఇటీవల జయత్రి ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ లో సోదాలు నిర్వహించిన ఈడీ స్కాం జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు కాగానే పరారయ్యాడు ఎండీ శ్రీనివాస్. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా గాలింపు జరిపిన ఈడీ అధికారులు.. ఎట్టకేలకు ఇవాళ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఇండ్లు, స్థలాల కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బుల వసూలు చేసినట్లు గుర్తించింది ఈడీ. డబ్బులు తీసుకుని ఇళ్లు,స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ..ఇప్పటివరకు 300 కోట్ల వరకు మోసం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది.
ఇటీవల జయత్రి ఎండీ కాకర్ల శ్రీనివాస్ ఇంటితో పాటు జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ అండ్ బిల్డర్స్, ఆర్కే రమేశ్, సత్యసాయి ట్రాన్స్‌పోర్ట్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన 8 ప్రాంతాల్లో 2 రోజుల పాటు సోదాలు చేసింది. ఇండ్లలోనే షెల్ కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు గుర్తించింది.
ఈ సోదాల్లో డిజిటల్ డివైజెస్, ప్రీ లాంచ్ స్కీమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ ఆఫీస్ సోమవారం వివరాలను వెల్లడించింది.
