సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడాలి : మంత్రి వాకిటి శ్రీహరి

సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడాలి : మంత్రి వాకిటి శ్రీహరి
  •     స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్  స్వీప్  చేద్దాం : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్  హాల్​లో నియోజకవర్గంలో  కాంగ్రెస్​ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అనే విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా సర్పంచులదేనని తెలిపారు.

 గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, సర్పంచ్  పదవిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకొని ప్రజల మన్ననలు పొందాలని, ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధైర్య పడవద్దని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మక్తల్ నియోజకవర్గంలో రూ.1,035 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత డెవలప్​ చేసేందుకు సహకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్  స్వీప్  చేసే దిశగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఏంఎసీ చైర్మన్  రాధా లక్ష్మారెడ్డి, బాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.