అంతరిస్తున్న గిరిజన సంప్రదాయ జీవనోపాధి

అంతరిస్తున్న గిరిజన సంప్రదాయ జీవనోపాధి

దేశవ్యాప్తంగా గిరిజన జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది.  2011 జనగణన  ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా 31.78 లక్షలు కాగా, ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో 9.08 శాతం. రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన  32 గిరిజన తెగలు ఉన్నాయి. వీరిలో అధిక శాతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరం భీమ్  ఆసిఫాబాద్, నాగర్​ కర్నూల్ జిల్లాల షెడ్యూల్డ్ ఏరియాలలో నివసిస్తున్నారు. ప్రతి తెగకు ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయాలు, జీవన విధానాలు ఉండటం వల్ల గిరిజన సమాజంలో విస్తృత  వైవిధ్యం  కనిపిస్తుంది.  కేంద్ర,   రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి చర్యలు చేపట్టినా, అన్ని గిరిజన తెగలు సమానంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంతర్గత అసమానతలు ఏర్పడ్డాయి. 

అటవీ ఉత్పత్తులపై ఆధారం

తెలంగాణలో చెంచులు, కొలాములు, కొండరెడ్డి, తోటి.. అత్యంత వెనుకబడిన  తెగలను ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు.  చెంచులు  ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతాలలో నివసిస్తూ, సంప్రదాయంగా వేట, జిగురు, తేనె వంటి అటవీ ఉత్పత్తులపై  ఆధారపడి జీవిస్తున్నారు.   ప్రస్తుతం స్థిర వ్యవసాయం వైపు మారుతున్నారు.  కొండరెడ్డి తెగ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయం, వెదురు బుట్టల తయారీ, అటవీ కూలీ పనులు చేస్తారు. తోటి తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో నివసిస్తూ గోండులతో సంబంధాలున్న సాంస్కృతిక వాహకులుగా ప్రసిద్ధి.  కొలాములు కూడా ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తూ పోడు సాగు, వెదురు కళాకృతులు, వ్యవసాయ  సాధనాల తయారీ ద్వారా జీవనం సాగిస్తున్నారు.

ఆదిమ గిరిజన తెగల అభివృద్ధికి
 చర్యలు తీసుకోవాలి

ఈ ఆదిమ గిరిజన తెగల ప్రధాన జీవనోపాధి వనరులు అటవీ ఉత్పత్తుల సేకరణ, వర్షాధారిత వ్యవసాయం. భూ హక్కుల లోపం, సాగునీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, ఆరోగ్య మరియు పోషకాహార లోపాలు వీరి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.  ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ,  ట్రెకార్ సంస్థల ద్వారా నివాసాలు,   మౌలిక వసతులు, వ్యవసాయం, పశుపోషణకు మద్దతు అందిస్తోంది.  ఆశ్రమ పాఠశాలలు, గురుకుల  విద్యా సంస్థల ద్వారా విద్యావకాశాలు కల్పిస్తోంది.  జీవనోపాధి, ఆరోగ్యం, విద్య రంగాలలో మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ ఆదిమ గిరిజన తెగల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక  చర్యలు అవసరం. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సాగునీటి వసతులు,  నేల ఆరోగ్య పరిరక్షణ పద్ధతుల ద్వారా వాతావరణానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి.  గ్రామీణ సేవారంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

- మామిడాల 
లక్ష్మీ ప్రసాద్