దయానంద సరస్వతి సేవలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బండారు దత్తాత్రేయ

దయానంద సరస్వతి సేవలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బండారు దత్తాత్రేయ

బషీర్ బాగ్, వెలుగు : దేశానికి మహర్షి దయానంద్ సరస్వతి  చేసిన సేవలు మరువలేనివని.. రాజనీతి తత్వవేత్తగా కీలక భూమిక పోషించారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దయానంద్ సరస్వతి లక్ష్యాలను, ఆశయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు.  ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలు ఆదివారం ఆర్యసమాజ్, మహర్షి స్వామి దయానంద సరస్వతి ఉత్సవ సమితి, సాంస్కృతిక శాఖ మంత్రాలయం, కేంద్ర ప్రభుత్వ సంయుక్తాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముందుగా నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి బషీర్ బాగ్, అసెంబ్లీ మీదుగా రవీంద్రభారతి వరకు శోభాయాత్రను తీసి సమావేశం నిర్వహించారు. ముందుగా యాత్రను  ప్రారంభించి గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆర్య సమాజాల అధికారులు, సభ్యులు, విద్యా సంస్థలు, గురుకులాలు, బ్రహ్మచార్యులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యుగ ప్రవక్త, వేదోద్ధారకుడు, సంఘ సంస్కర్త, మానవతావాది మహర్షి దయానంద సరస్వతి జయంతి ఉత్సవాలను దేశ విదేశాల్లో జరపాలనే  ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నట్లు ఆర్యసమాజ్ నిర్వాహకులు తెలిపారు.