2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. దీన్ని అందరూ అన్ని పార్టీలూ ఆసక్తిగానే చూశాయి. అధికారపార్టీ (కాంగ్రెస్ పార్టీ)కి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రధాన ప్రతిపక్షపార్టీ(బీఆర్ఎస్) దాని అస్తిత్వంపైనే ఆందోళనకు గురవుతున్నది. రెండో ప్రతిపక్షపార్టీ (బీజేపీ) కనీసం రెండో స్థానమైనా దక్కించుకోవడమో లేదా కనీసం గౌరవప్రదమైన ఓట్లనో సాధించుకోవాలనుకుంది. కానీ, అందుకు భిన్నంగా డిపాజిట్ కోల్పోవడంతో దాని నాయకత్వ బలహీనతపైనే ఆ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా.. రెండేండ్ల రేవంత్ ప్రభుత్వం పట్ల ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రజల్లో సానుకూలతకో, వ్యతిరేకతకో కొలమానం కాకపోయినా.. రేవంత్ నాయకత్వం బలమైనదేనని నిరూపించుకుందని మాత్రం చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయవేత్త అని ఉప ఎన్నిక ఫలితం చెపుతోంది. ఉప ఎన్నిక సోషల్ ఇంజినీరింగ్‌లో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్ ఉన్నా.. అనేకసార్లు ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పార్టీని గెలిపించడం మాత్రం ఆయన తన సమర్థతను చాటి చెపుతోంది.
గత పదేండ్లలో ఆర్థిక విధ్వంసానికి గురైన తెలంగాణ ప్రభుత్వాన్ని చక్కదిద్దాల్సిన పెద్ద బాధ్యత మాత్రం రేవంత్‌పైనే ఉంది. రేవంత్ ప్రభుత్వానికి రాజకీయ సవాళ్ల కన్నా .. ఆర్ఠిక సవాళ్లే పెద్ద సమస్య. బీఆర్ఎస్ పదేండ్ల ఆర్థిక విధ్వంసం నుంచి రేవంత్ ప్రభుత్వం అనేక అవరోధాలను ఎదుర్కొంటూ వస్తున్నది. వాటిని ఇప్పటికిప్పుడు అధిగమించడం రేవంత్ ప్రభుత్వానికి అంత సులభం కాకపోవచ్చు. రేవంత్ రెడ్డి అనేక సదస్సుల్లో గత పదేండ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి డైరెక్టుగా ప్రజలకే చెపుతున్నారు. ఆయన చెపుతున్నవన్నీ పూర్తి నిజాలే.
ఉద్యోగుల బెనిఫిట్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా అందడం వంటి అనేక సమస్యలకు రెండేండ్ల రేవంత్ ప్రభుత్వమే కారణమని ఎవరూ అనుకోవడం లేదు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు పడేయాలంటే, రేవంత్ ప్రభుత్వానికి ఇంకా చాలాకాలమే పట్టొచ్చు. ఈ విషయం ప్రజలకు కూడా బాగా తెలుసు. కాబట్టి రేవంత్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ గెలుపుతో మరింత బాధ్యత పెరిగింది తప్ప తరగలేదు. గత ప్రభుత్వ అవినీతిపై జరిగిన దర్యాప్తులపై చర్యలు ఏవి? అనే ప్రజల ప్రశ్నకు జవాబుదారీగా వాటిపై చర్యలు తీసుకుంటే, రేవంత్ ప్రభుత్వం ప్రజల మరింత విశ్వసనీయతను కాపాడుకున్నట్లవుతుంది!
ధనిక ప్రతిపక్షం దర్పం తగ్గలే !
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారం, అర్భాటం అధికార పార్టీతో సమానంగా చేసింది. అస్త్రశస్త్రాలు అన్నీ ఉపయోగించింది. పేరుకు బీఆర్ఎస్ ప్రతిపక్షమే అయినా మునుపటి దర్పం ఏమాత్రం తగ్గలేదు. పదేండ్లలో బీఆర్ఎస్ దేశంలోనే ధనిక పార్టీగా నమోదయింది. అర్థబలం, క్యాడర్ అంగ బలం పుష్కలంగానే ఉంది. ఇప్పటి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్న అప్పటి అధికారుల సహకారం బీఆర్ఎస్ యజమానులకు ఇప్పటికీ ఉన్నదని అనేక సంఘటనలూ చెపుతున్నాయి కూడా! అందుకే ఆ పార్టీ హావభావాలలో, విమర్శలలో అధికార దర్పం తప్ప తామొక ప్రతిపక్షం అనేది కనిపించదు.
నైతికత లేని ప్రశ్నలతో అభాసుపాలు !
బీఆర్ఎస్ ‘ముఖ్య నేతలు’ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు, విమర్శలు చాలానే ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్క విమర్శ చేయడానికీ ఆ పార్టీకి నైతికత ఉన్నట్లనిపించదు. ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ బకాయిలు వంటివి ఎన్నో కేటీఆర్ బాగా లేవనెత్తారు. కానీ వాటన్నిటి బకాయిలు తమ ప్రభుత్వ హయాంలోనే చాలామేరకు ఏర్పడ్డాయనే విషయం ఆయన మర్చిపోయాడనుకోలేం! గత మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ జూబ్లీహిల్స్ మురికివాడలు, బస్తీల దుస్థితి గురించి మాట్లాడితే.. ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయన ఆలోచించలేదు. మంత్రి వివేక్ రూ. వందల కోట్లతో ఆ పనులు చక్కబెట్టారు కూడా. గంపెడు తప్పులు చేసిన బీఆర్ఎస్ ఇపుడు అవే తప్పులపై ఇప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే ఎంత అనైతికంగా ఉంటుందో కేటీఆర్ చేసిన ప్రచారాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
నైతికత లేని ప్రతిపక్షమే.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశం !
కేసీఆర్ ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు, 58 నుంచి 61 ఏండ్లకు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ను పెంచింది. ఆరేండ్లుగా రిటైర్డ్ కావలసినవారంతా 2023 తర్వాత రిటైర్ అయ్యారు. వారి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం పై పడింది. ఇలా అన్ని అర్థిక సమస్యలను రాబోయే ప్రభుత్వంపై నెట్టేసిన బీఆర్ఎస్ యజమాని ఇపుడు ఫాంహౌజ్‌లో హాయిగా సేద తీరుతున్నారు.
తాము చేసి పెట్టిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దలేమని వారికీ తెలుసు కాబట్టి.. బీఆర్ఎస్ యజమానులు నిజంగా 2023 ఎన్నికల్లో తమకు తాము ఓడిపోవాలని కోరుకున్నారేమో అని అనిపిస్తోంది! అందుకే, తాము చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టి ‘పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగుతున్నట్లు’ తామే చేసిన తప్పిదాలపై మరొకరిని నిందించడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. ప్రశ్నించే నైతికతను కోల్పోయిన ప్రతిపక్షం ఉండడం.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్‌లో బాగా కలిసొచ్చిన అంశం అని చెప్పాలి. నిజానికి కాంగ్రెస్ ను ఏ మాత్రమైనా ప్రశ్నించదగ్గ నైతికత ఉన్న పార్టీ ఏదంటే, అది బీజేపీయే! కానీ ఆ పార్టీ ఆ బాధ్యతను నైతికత లేని బీఆర్ఎస్కే వదిలేసినట్లుంది!
జబ్బుగా మారిన బలహీనత!
గత 7 ఏండ్లుగా తెలంగాణలో బీజేపీ బాగా బలపడిన పార్టీగా పేరుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించి, 8 లోక్‌సభ స్థానాలు గెలవడం చూస్తే, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ ఆ పార్టీ తమది వాపేకానీ, బలుపు కాదంటూ.. జూబ్లీహిల్స్‌లో తాను కాకుండా బీఆర్ఎస్ను రెండో స్థానంలో నిలబెట్టింది. రాష్ట్రంలో బీజేపీ బలహీన నాయకత్వం అనే జబ్బుతో బాధపడుతున్నదనేది కామన్ మ్యాన్ టాక్ మాత్రమే కాదు.. ఆ పార్టీ క్యాడర్‌లోనూ అదే అభిప్రాయం బలంగా ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణను కాలానికి
వదిలేసినట్లుంది!
స్థానిక నాయకత్వం లేకుండా బీజేపీ గెలుపు అసాధ్యం!
ఉత్తరాదిలో లోక్‌సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా మోదీ చరిష్మాతోనే గెలుస్తూ వస్తోంది. అక్కడ స్థానిక నాయకత్వం అవసరం లేకపోవచ్చు. కానీ, తెలంగాణ అనే రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ నేత(కేసీఆర్), ఒక జాతీయపార్టీకి చెందిన ప్రాంతీయ నేత(రేవంత్‌రెడ్డి) ఉన్నాడనే విషయం బీజేపీ అధినాయకత్వానికి అవగాహన ఉందో లేదో తెలియదు! అలా ఇద్దరు ప్రాంత నేతలను ఎదుర్కోవాలంటే, స్థానికంగా సమ ఉజ్జీ నాయకుడు ఉండాలనే సోయి బీజేపీకి ఉందనిపించదు.
ఉత్తరాది లాగనే తెలంగాణలోనూ మోదీ పేరనే గెలవాలంటే అది లోక్‌సభ ఎన్నికలకు సరిపోతుంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా మోదీ పేరనే గెలవాలంటే అది సాధ్యం కాదని చరిత్ర చెపుతోంది. మోదీ చరిష్మా, స్థానిక నాయకుడి పటిమ కలిస్తేనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎంత ఆర్గనైజేషనల్ పార్టీ అని చెప్పుకున్నా.. స్థానికంగా బలమైన నాయకుడు లేకుండా గెలవడం ఏమేరకు సాధ్యమో మోదీకే తెలియాలి!
బీఆర్ఎస్తో అంతర్గత సంబంధాలపై అనుమానాలు?
గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీ పగ్గాలను బలహీన నాయకత్వాలకు అప్పజెప్పడంలోని మోదీ ఉద్దేశం ఏమిటో ఆ పార్టీ క్యాడర్‌కే ఇప్పటికీ అర్థం కాలేకపోతున్నది. బీఆర్ఎస్తో అంతర్గత అవగాహన ఏమైనా ఉందా అనే అనుమానాలూ పెరుగుతున్నాయి! ప్రజలు వద్దనుకుంటున్న పార్టీతో బీజేపీ ఎలాంటి సంబంధాలు నెరిపినా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాలం మరింత కలిసొచ్చినట్లే అని అంటున్నారు రాజకీయ పండితులు! రిమోట్ గ్రామాల్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఓటేశారంటే చిన్న విషయం ఏమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలే ప్రధాన ప్రత్యర్థులుగా స్థిరపడతాయని, బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కోల్పోనుందనే అభిప్రాయం సర్వత్రా ఉన్న దశలో.. ఆ పార్టీ పనితీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తోంది!
బైపోలర్ రాజకీయాల్లో బీజేపీ పనితీరు ఇదా ?
తెలంగాణ రాజకీయాల్లో త్రికోణ (ట్రయాంగులర్) పోటీకి అమోదం లభించడం లేదని గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు చెప్పాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్,-బీఆర్ఎస్లే ప్రధాన ప్రత్యర్థులుగా (బైపోలర్గా) జరిగాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా జరిగాయి. ట్రయాంగులర్ పోటీకి అవకాశం లేదని ఆ రెండు ఎన్నికలు చెప్పాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అదే విషయం చెప్పింది. కానీ అది బీజేపీకి మాత్రమే అర్థంకాని విషయంగా ఉన్నట్లుంది కదా!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా కొనసాగేదే తప్ప కనుమరుగయ్యేది కాదు! ఇక ప్రత్యర్థిగా బీఆర్ఎస్, బీజేపీలలో ఏది అనే వాతావరణం ఉన్న దశలో.. జూబ్లీహిల్స్‌లో అంతటి పూర్ పర్ఫామెన్స్ చూపిన బీజేపీని ఎవరు కాపాడతారో తెలియదు! బైపోలర్ పొలిటికల్ సిచువేషన్ ఉన్న తెలంగాణలో బీజేపీ నిలబడాలనుకుంటున్నదా? లేక బీఆర్ఎస్కే తిరిగి అప్పజెప్పాలను కుంటున్నదా అనేదే తేలాలి! రాష్ట్రంలో ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ పార్టీయే తిరిగి ప్రధాన ప్రత్యర్థిగా బతికితే మాత్రం ఆ దోషం ఘనత వహించిన కిషన్ రెడ్డి, రామచంద్రరావులదే కాదు..వారిని రాష్ట్ర పెద్దలుగా ఆదరిస్తున్న నరేంద్ర మోదీది కూడా అవుతుంది!
కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
