- సీబీఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్ నేరగాళ్లు
- వీడియో కాల్ ద్వారా బాధితురాలిని 6 నెలలు ట్రాప్
- 187 బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయించి మోసం, బెంగళూరులో ఘటన
బెంగళూరు: సీబీఐ ఆఫీసర్లమని చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ మహిళను దారుణంగా మోసం చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ.32 కోట్లు కొల్లగొట్టారు. వీడియో కాల్ ద్వారా ఆమె కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ 6 నెలల పాటు ట్రాప్‌లో ఉంచారు. 187 సార్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయించుకుని గాయబ్ అయ్యారు. తనను నిండా ముంచేశారని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డబ్బులు వాపస్ వస్తాయని నమ్మించి డిపాజిట్
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉమారాణి(57)కి 2024 సెప్టెంబర్ 15న ముంబై నుంచి కాల్ వచ్చింది. తాను సీబీఐ ఆఫీసర్‌నని, మీ పేరుతో నకిలీ పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిందంటూ ఉమారాణి నుంచి వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుంటుందని ఆమెను బెదిరించాడు.
ఈ కేసును సీనియర్ ఆఫీసర్ పర్యవేక్షిస్తాడని చెప్పి మరో వ్యక్తితో కాల్ చేయించాడు. ఈ సారి వీడియో కాల్ చేసిన ఆ వ్యక్తి ఉమారాణి ద్వారా రెండు స్కైప్ ఐడీలను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించాడు. ఆపై డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి, మీ ఆస్తులన్నీ ఆర్బీఐకి చెందిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని ఆదేశించాడు.
ఆర్బీఐ ధృవీకరణ తర్వాత డబ్బులు వాపస్ వస్తాయని చెప్పి నమ్మించాడు. ఇదంతా నిజమే అనుకున్న ఉమారాణి ఆ మోసగాళ్లు చెప్పినట్లు చేశారు. పోయినేడాది అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3లోగా ష్యూరిటీ కింద 2 కోట్ల రూపాయలను స్కామర్లు చెప్పిన ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ట్యాక్స్‌లని చెప్పి మరికొంత.. ఇలా ఉమారాణితో ఆరు నెలల్లో 187 ట్రాన్సాక్షన్లలో మొత్తంగా 31.80 కోట్ల రూపాయలను జమచేయించారు.
ఈ ఏడాది జనవరికల్లా సీబీఐ లెటర్‌హెడ్‌తో క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన నేరగాళ్లు.. డబ్బులు త్వరలోనే రిటన్ వస్తాయంటూ దాటవేస్తూవచ్చారు. మార్చికల్లా వాళ్ల ఫోన్‌లు పనిచేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఉమారాణి ఇటీవల బెంగళూరు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
