- సజీవ దహనం ! సౌదీలో ఘోర బస్సు ప్రమాదం...45 మంది హైదరాబాదీలు
- మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దగ్ధమైన బస్సు
- 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు మృతి
- ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు
- ఈ నెల 9న ఉమ్రా యాత్రకు వెళ్లిన 54 మంది హైదరాబాద్ వాసులు
- మక్కా దర్శనం అనంతరం బస్సులో 46 మంది మదీనాకు పయనం
- మార్గంమధ్యలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం
- మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, మరో ఫ్యామిలీకి చెందిన ఆరుగురు
- అనారోగ్యంతో హోటల్‌లో నలుగురు ఉండగా, కారులో మరో నలుగురు వెళ్లడంతో దక్కిన ప్రాణాలు
- బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- సౌదీలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు.. సర్కార్ ఖర్చులతోనే కుటుంబసభ్యుల తరలింపు
- పర్యవేక్షణకు మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది మృతి చెందారు. మక్కా దర్శనం అనంతరం మదీనాకు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి దాటినంక 1:30 గంటలకు (ఇండియన్ టైమ్)... మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో వాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో ముషీరాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు.
ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. వీళ్లతోనే ఉమ్రా యాత్రకు వెళ్లిన మరో నలుగురు అనారోగ్య సమస్యలతో మక్కాలోనే ఉండిపోగా, ఇంకో నలుగురు కారులో మదీనాకు వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ప్రమాద విషయం తెలిసి రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు విదేశాంగ శాఖ ద్వారా సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
9న ఉమ్రా యాత్రకు..
హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ‘ఫ్లై జోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ ఏటా హజ్, ఉమ్రా యాత్రలకు ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 23 వరకు 15 రోజుల పాటు ఉమ్రా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మల్లేపల్లిలోని అల్ మక్కా, అంబర్‌పేట్‌లోని బాబా ఉల్ హర్‌మయిన్ , హఫ్సా, మహమూద్ భాయిజాన్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాణికులను సమకూర్చాయి.
ముషీరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన షేక్ నసీరుద్దీన్, అక్తర్ బేగం దంపతులు సహా కుటుంబసభ్యులు 18 మంది, మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్ నగర్, టోలీచౌకీలోని పలు కుటుంబాలకు చెందిన మరో 35 మంది, హుబ్లీకి చెందిన ఒకరు .. ఇలా మొత్తం 54 మంది ఈ నెల 9న ఉమ్రాకు బయలుదేరారు. ట్రావెల్ ఏజెన్సీల ప్యాకేజీలో భాగంగా అదే రోజు ఉదయం11 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జెడ్డాకు వెళ్లారు.
మక్కా నుంచి మదీనాకు పయనం..
హైదరాబాద్ నుంచి జెడ్డాకు చేరుకున్న అనంతరం వీరంతా అక్కడి హోటళ్లలో బస చేశారు. ఆ తర్వాత మక్కా సహా చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించుకున్నారు. మక్కా దర్శనం అనంతరం సోమవారం రాత్రి అక్కడి నుంచి మదీనాకు బయలుదేరారు. అనారోగ్యం కారణంగా నలుగురు హోటల్‌లోనే ఉండిపోగా, మరో నలుగురు ప్రైవేట్కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన వారిలో 18 మంది పురుషులు, 18 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు సహా మొత్తం 46 మంది సౌదీ అరేబియా ప్రభుత్వ బస్సు సర్వీసులో మదీనాకు బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి సహా మొత్తం 49 మంది ప్రయాణిస్తున్నారు. మక్కా నుంచి మదీనాకు దాదాపు 430 కిలోమీటర్ల దూరం కాగా.. 4 గంటల 30 నిమిషాలు జర్నీ చేయాల్సి ఉంటుంది.
ఓపెన్ కాని బస్సు డోర్లు..
మక్కా నుంచి మదీనాకు బయల్దేరిన బస్సును.. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో (సౌదీ టైమ్) ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకొని ఆయిల్ట్యాంకర్లోని ఫ్యూయెల్కారణంగా లిప్తపాటులో బస్సులోకి మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్నవారంతా ఏం జరిగిందో తెలుసుకునేలోపే మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. బస్సుకు రెండు డోర్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ తెరుచుకోలేదని తెలిసింది. హుమాయున్ నగర్ నుంచి వెళ్లిన ఏడుగురు సభ్యుల కుటుంబంలో అబ్దుల్ షోయబ్ అనే యువకుడు మాత్రం బస్సు కిటికీలోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షోయబ్.. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. విషయం తెలిసి బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
సౌదీకి బాధిత కుటుంబ సభ్యులు..
ఇండియన్ ఎంబసీ ద్వారా ప్రమాద సమాచారం అందడంతో హైదరాబాద్పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఉమ్రాకు వెళ్లిన ప్రయాణికుల వివరాలు సేకరించి, విదేశాంగ శాఖ ద్వారా సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో కుటుంబానికి ఇద్దరి చొప్పున బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఖర్చుతో సౌదీ తీసుకెళ్లాలని ప్రభుత్వంనిర్ణయించింది. పర్యవేక్షణకు మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపనుంది. మరోవైపు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రమాదంలో చనిపోయినోళ్ల వివరాలివీ..
నల్లకుంట, విద్యానగర్: నసీరుద్దీన్ షేక్, మరియం ఫాతిమా, అక్తర్ బేగం, రిజ్వానా బేగం, షేక్ జైనుద్దీన్, ఫరానా సుల్తానా, రిడా తజీన్, మహమ్మద్ షాజైన్ అహ్మద్, ఉమైజా ఫాతిమా, సనా సుల్తానా, ఉజైరుద్దీన్ షేక్, మెహ్రీష్ ఫాతిమా
రాంనగర్, ముషీరాబాద్: సలావుద్దీన్ షేక్
టప్పాచబుత్ర, కార్వాన్: షెహనాజ్ బేగం
టప్పాచబుత్ర, జిర్రా: షౌకత్ బేగం, మొహమ్మద్ మౌలానా, అబ్దుల్ ఖదీర్ మహ్మద్, మహమ్మద్ అలీ, గౌసియా బేగం
మొఘల్‌నగర్, లంగర్‌హౌస్: హుమేరా నజ్నీన్, సబీహా సుల్తానా, ఇర్ఫాన్ అహ్మద్, ఇజాన్ అహ్మద్, హమదాన్ అహ్మద్
కిషన్ నగర్, ఆసిఫ్ నగర్: ఫరీదా బేగం, తస్మియా తహ్రీన్, మహమ్మద్ మంజూర్, జహీనా బేగం
మురద్‌నగర్, ఆసిఫ్ నగర్: సారా మహమూద్ అల్ అమోదీ, షాహజహాన్ బేగం
ఫారూఖ్‌నగర్, ఫలక్‌నుమా: మస్తాన్ మహ్మద్, జకియా బేగం
నారాయణగూడ, హిమాయత్‌నగర్: హుజైఫా జాఫర్ సయ్యద్, షబానా బేగం
మేరాజ్ కాలనీ, టోలిచౌకీ: మహ్మద్ షోయబ్, రేయీస్ బేగం
సులేమాన్ నగర్, రాజేంద్రనగర్: పర్వీన్ బేగం, వట్టేపల్లి, ఫలక్‌నుమా: సోహైల్ మహమ్మద్,
మూసారాంబాగ్, మలక్‌పేట్: అనీస్ ఫాతిమా, షాలిబండ, బహదూర్‌పురా: సలీమ్ ఖాన్
గాంధీగంజ్, సీఎంసీ కాలనీ: రహమత్‌బీ
కాలాపత్తర్, చార్మినార్: సారా బేగం
బోరబండ, సనత్‌నగర్: రహమతున్నీసా
జమదార్ చాల్ గణేష్ పేట, హుబ్లీ: అబ్దుల్ గని అహ్మద్ సాహెబ్
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ విదేశాంగ శాఖలో రాష్ట్ర అధికారి
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. తెలంగాణవాసులు ఎంత మంది ఉన్నారో నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల కోసం లైజన్ హెడ్ వందన (98719 99044), పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ చక్రవర్తి (99583 22143), లైజన్ ఆఫీసర్ రక్షిత్ నాయక్ (96437 23157)ను సంప్రదించాలని భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా.. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయెల్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సెక్రటరీ కో–ఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ (ఐఏఎస్), డిప్యూటీ కమిషనర్ సంగీత, లైజన్ హెడ్ వందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గాయపడినవారి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి, సంప్రదింపులు జరిపేందుకు తెలంగాణ భవన్ నుంచి ఒక అధికారిని ప్రత్యేకంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆర్సీ శశాంక్ గోయల్ తెలిపారు.
హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్
సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యుల కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరణించిన వారి బంధువులు సౌదీకి వెళ్లడానికి కావాల్సిన పాస్‌పోర్ట్, వీసాల కోసం ఈ కంట్రోల్ రూమ్‌లో సపోర్ట్ అందజేస్తారు. అలాగే, ఇతర సమాచారాన్ని అందజేస్తామని, 040– 2785 2333 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
