కోల్‌కతా: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం (నవంబర్ 19) జట్టుతో కలిసి అతను గువాహతికి ప్రయాణించడం లేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వర్గాలు ధృవీకరించాయి.
గిల్ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడని, మెడకు ఇంకా పట్టీ ఉందని తెలిపాయి. ‘గిల్‌కు మరో మూడు నుంచి నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. విమాన ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఈ పరిస్థితిలో అతను గువాహతి వెళ్లడం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మంగళవారం నాటికి క్లారిటీ రావొచ్చు’ అని పేర్కొన్నాయి.
