కెప్టెన్‌‌‌‌ x కోచ్‌‌‌‌.. పిచ్‌‌‌‌ విషయంలో గిల్‌‌‌‌, గంభీర్ మధ్య కుదరని ఏకాభిప్రాయం

కెప్టెన్‌‌‌‌ x కోచ్‌‌‌‌..  పిచ్‌‌‌‌ విషయంలో గిల్‌‌‌‌, గంభీర్ మధ్య కుదరని ఏకాభిప్రాయం

కోల్‌‌‌‌కతా: ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో టీమిండియాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ స్టేడియం పేరు చెప్పగానే 2001లో వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌–రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియాపై అందించిన చారిత్రక విజయం గుర్తుకొస్తుంది. కానీ, ఇప్పుడు  సౌతాఫ్రికాతో మూడ్రోజుల్లోనే ముగిసి టీమిండియా చిత్తుగా ఓడిన టెస్టును అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. 

సొంతగడ్డపై 124 రన్స్‌‌‌‌ చిన్న టార్గెట్‌‌‌‌ను కూడా ఛేజ్ చేయలేక బొక్కబోర్లాపడిన శుభ్‌‌‌‌మన్ గిల్ కెప్టెన్సీలోని ఇండియా విమర్శలను ఎదుర్కొంటోంది.  తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 30 రన్స్‌‌‌‌ ఆధిక్యం దక్కించుకొని విజయం మనదే అన్న దశ నుంచి చివరకు 30 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడి అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి కేవలం మైదానంలో ఆటతీరుకే పరిమితం కాలేదు. టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో ముఖ్యంగా యంగ్‌‌‌‌ కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య స్వదేశంలో  పిచ్ సెలెక్షన్‌‌‌‌పై విభేదాలను  బట్టబయలు చేసింది.

  నెల రోజుల కిందట కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ టీమ్ ఫ్యూచర్ ప్లాన్స్ పై స్పష్టమైన ప్రకటన చేశాడు. కేవలం స్పిన్‌‌‌‌కు మాత్రమే సహకరించే  ర్యాంక్ టర్నర్ల సంస్కృతికి స్వస్తి పలికామని బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌కు సమతూకంగా ఉండే  వికెట్లపైనే ఆడాలనుకుంటున్నామని  స్పష్టం చేశాడు. కానీ, వరల్డ్  టెస్ట్ చాంపియన్ సఫారీలతో తలపడిన ఈడెన్ పిచ్  కెప్టెన్ మాటలకు పూర్తి విరుద్ధంగా సిద్ధమైంది. వారం రోజులుగా నీళ్లు పట్టకుండా, సాయంత్రం వేళల్లో కవర్లతో కప్పి పిచ్‌‌‌‌ను పూర్తిగా పొడిబారేలా చేశారు. 

ఫలితంగా మ్యాచ్ తొలి సెషన్ నుంచే పిచ్‌‌‌‌పై పగుళ్లు ఏర్పడ్డాయి. కేవలం 8 సెషన్లలోనే మ్యాచ్ ముగిసి 38 వికెట్లు నేలకూలాయంటే (స్పిన్నర్లకు 22, పేసర్లకు 16) పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ కోరుకున్న పిచ్ ఇదేనని కోచ్ గంభీర్ గట్టిగా సమర్థించుకోవడం చర్చనీయాంశమైంది. ‘సరిగ్గా ఆడకపోతే ఇలాగే జరుగుతుంది. వికెట్‌పై దెయ్యాలేమీ లేవు’ అని వ్యాఖ్యానించిన గౌతీ..  ఓటమికి బ్యాటర్లను నిందించాడు. కానీ, తొలిరోజు బుమ్రా నుంచి అనూహ్యంగా బౌన్స్‌‌‌‌ అయిన బాల్‌‌‌‌కు ఔటైన మార్​క్రమ్​, నాలుగో ఇన్నింగ్స్‌‌‌‌లో యాన్సెన్ బాల్‌‌‌‌కు వికెట్ కోల్పోయిన రాహుల్‌‌‌‌  గంభీర్ వాదనతో  ఏకీభవించలేరు. కెప్టెన్ గిల్ బ్యాలెన్స్‌‌‌‌డ్ వికెట్ కోరితే,  కోచ్ టర్నర్‌‌‌‌‌‌‌‌ వైపు మొగ్గు చూపడం.. టీమ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో గందరగోళం,  సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆసుపత్రిలో కెప్టెన్‌‌‌‌.. బ్యాటర్ల ఆపసోపాలు.. 

మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ ఔట్ అయిన గిల్ హాస్పిటల్‌‌‌‌లో చేరిన వేళ ఈడెన్‌‌‌‌లో బ్యాటింగ్ లైనప్ పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటర్లలో  క్రమశిక్షణ, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే నైపుణ్యం  కొరవడ్డాయి. ఈ ఓటమితో స్వదేశంలో ఆడిన గత ఆరు టెస్టుల్లో ఇండియా నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఒకప్పుడు సొంతగడ్డపై అజేయం అనే ముద్ర చెరిగిపోతోంది. గంభీర్ కోచింగ్‌‌‌‌లో ఆడిన 18 టెస్టుల్లో ఇండియా 8 మ్యాచ్‌‌లే నెగ్గింది. అందులో నాలుగు బలహీన జట్లయిన బంగ్లా, వెండీస్‌‌పైనే వచ్చాయి. 

గతేడాది న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో 0-–3తో వైట్‌‌‌‌వాష్.. అజాజ్‌‌‌‌ పటేల్‌‌‌‌, శాంట్నర్ స్పిన్ దెబ్బకు మన బ్యాటర్లు తిప్పలు పడ్డ తీరు ఇంకా మర్చిపోకముందే సఫారీల చేతిలో తాజా ఓటమి జట్టు ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పట్టికలో ఇండియా నాలుగో ప్లేస్‌‌‌‌కు పడిపోయింది. 

వ్యూహాత్మక వైఫల్యం 

గిల్‌‌‌‌ లేని సమయంలో ఈ మ్యాచ్‌‌‌‌లో వ్యూహాత్మక తప్పిదాలు కూడా కొట్టొచ్చినట్లు కనిపించాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 93/7 స్కోరుతో 63 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో మాత్రమే ఉంది. మూడో రోజు ఉదయం, చల్లటి గాలులతో పేస్‌‌‌‌కు అనుకూలించే ఈడెన్ వాతావరణంలో తొలి ఇన్నింగ్స్ హీరో బుమ్రాను కాకుండా స్టాండిన్ కెప్టెన్ పంత్  స్పిన్నర్లతో బౌలింగ్ ప్రారంభించాడు.  బుమ్రాను 9వ ఓవర్లో బరిలోకి దించేసరికే  బవూమ, కార్బిన్ బాష్‌‌‌‌ క్రీజులో పాతుకుపోయి ఆధిక్యాన్ని 100 దాటించారు. బవూమ అజేయ ఇన్నింగ్స్ మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పింది.  ఏదేమైనా ఈ ఓటమి ఒకే మ్యాచ్ వైఫల్యం కాదు. 

కొన్నాళ్లుగా జట్టులో నెలకొన్న వ్యూహాత్మక గందరగోళం, పిచ్‌‌‌‌లపై అతిగా ఆధారపడటం వల్ల జరిగిందని స్పష్టమవుతోంది. ఇప్పుడు  గువాహతిలో రెండో టెస్టులో గెలిచినా ఇండియా ఈ సిరీస్ నెగ్గలేదు. కానీ, స్వదేశంలో మరో వైట్‌‌‌‌వాష్ మూటగట్టుకోకూడదంటే అక్కడ అయినా జాగ్రత్తగా ఆడాలి. టీమిండియా తన తదుపరి హోమ్ సిరీస్ (బోర్డర్–-గావస్కర్​ ట్రోఫీ) కోసం 2027 జనవరి వరకు వేచి చూడాలి.  ఈలోపు శ్రీలంక (2026 ఆగస్టు), న్యూజిలాండ్ (అక్టోబర్‌‌‌‌‌‌‌‌) టూర్లు ఉన్నాయి. ఏదేమైనా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రయాణం ఇప్పుడు మరింత కఠినంగా మారింది.