- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: రైతుల భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి తొలగించి వెంటనే రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించాలని హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కోహెడ చౌరస్తాలో కోహెడ జేఏసీ ఆధ్వర్యంలో రైతుల భూ సమస్యలు, కోహెడ డివిజన్ ఏర్పాటుపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
భూములు కోల్పోయిన రైతులకు 500 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. మాస్టర్ ప్లాన్ రైతులకు నష్టంగా మారిందని, దానిని మార్చాలని కోరారు. అఖిలపక్ష కమిటీ తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్లో కలపాలని, జీహెచ్ఎంసీ 53వ డివిజన్‌కు కోహెడ పేరు పెట్టాలని తీర్మానించింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, వివిధ పార్టీల నాయకులు బిందు రంగారెడ్డి, విజయ్‌బాబు, బోసుపల్లి ప్రతాప్, రాంరెడ్డి, బలదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
