
- యురేనియం తవ్వకాలు ఆపాలి
- విజయవంతమైన అఖిలపక్షం బంద్
అమ్రాబాద్, వెలుగు: ఎంతో జీవవైవిధ్యం కలిగిన సుందరమైన నల్లమలను యురేనియం తవ్వకాలతో వల్లకాడు చేయొద్దని అఖిలపక్షం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సోమవారం అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ విజయవంతం అయింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటుగా ప్రజా, కుల సంఘాలు, స్థానికులు దాదాపు నాలుగు వేల మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ యురేనియం ప్రపంచస్థాయిలో దేశ ఆధిపత్యానికి అవసరమైన అంశం అయినప్పటికీ, ఇక్కడ తవ్వకాలు పర్యావరణ వినాశనానికి దారితీస్తాయన్నారు. హరితహారం పేరుతో మొక్కలు నాటుతూ.. మరోవైపు నల్లమలలో సహజసిద్ధమైన వృక్ష సంపదను నాశనం చేయడం విచిత్రంగా ఉందన్నారు. నల్లమల వినాశనంలో మొదటి సూత్రదారి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రెండో సూత్రదారి కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. కేంద్రం యురేనియం కోసం అన్వేషిస్తుంటే వీళ్లు ఖనిజాల కోసం చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి వారు కూడా పోరాడారన్నారు… ప్రస్తుత నల్లమల సమస్యను మానవాళి జీవన్మరణ సమస్యగా పరిగణించి ఉద్యోగులు, పోలీసులు సహకరించాలని ఈ ఉద్యమానికి సహకరించాలని ప్రజాఫ్రంట్ నాయకుడు అంబయ్య టీజేఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి ద్రోణాచారి ఆరోపించారు. యురేనియం వెలికితీత వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్ కలుముల నాసరయ్య, యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ దాసరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.