
సీఎం కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వుతో ఉద్యోగుల స్థానికతకు ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. స్థానికులైన ఉద్యోగులు కొత్త జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందిని తెలిపారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతర సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందన్నారు సంజయ్. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం స్రుష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు.