సిట్టింగ్ జడ్జితో విచారించే దమ్ముందా : బండి సంజయ్

సిట్టింగ్ జడ్జితో విచారించే దమ్ముందా : బండి సంజయ్
  • టెన్త్ పేపర్ లీకేజీ కుట్రదారులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులే : సంజయ్
  • వరంగల్ సీపీ.. నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేస్తవా? 
  • నాపై దాడి చేసినందుకు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్త 
  • టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలో కేటీఆర్​ను బర్తరఫ్ చేయాల్సిందే 
  • త్వరలో వరంగల్​లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడి 
  • కరీంనగర్​ జైలు నుంచి విడుదలైన బీజేపీ స్టేట్ చీఫ్ 

కరీంనగర్, వెలుగు : టెన్త్ పేపర్ లీకేజీ కుట్రదారులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘హిందీ పేపర్​ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. టెక్నాలజీలో మేమే తోపు అని చెప్పుకునేటోళ్లు.. లీకేజీ కుట్రను ఎందుకు ఛేదించలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే.. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి” అని ఆయన సవాల్ విసిరారు. 

ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఎలా పోయిందని, క్వశ్చన్ పేపర్ ను ఎవరో షేర్ చేస్తే తనకేం సంబంధమని ప్రశ్నించారు. అంతకు ముందు జరిగిన తెలుగు ఎగ్జామ్ పేపర్ ను ఎవరు లీక్ చేశారు? ఎలా లీకైందో చెప్పాలని డిమాండ్ చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయి కరీంనగర్ జైలులో రిమాండ్​లో ఉన్న సంజయ్.. శుక్రవారం ఉదయం బెయిల్​పై విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే టెన్త్ పేపర్ లీకేజీ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. 

సీపీ.. ప్రమాణం చేస్తవా? 

వరంగల్ సీపీపై సంజయ్ ఫైర్ అయ్యారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే తెల్వడం లేదన్నారు. ‘‘సీపీకి పేపర్ లీకేజీకి, మాల్ ప్రాక్టీస్​కు తేడా తెలియడం లేదు. ఎగ్జామ్ కంటే ముందే పేపర్ బయటకు వస్తే లీకేజీ అంటరు. ఎగ్జామ్ మొదలయ్యాక లోపలికి ఎట్ల పోయి న్రు? అది మీ చేతగానితనం. పోలీసోళ్లకు అక్కడ డ్యూటీ వేయలేదు. అక్కడే కుట్ర పన్నారు. మళ్లీ ఆ కుట్రను నా మీదకు నెట్టారు. లీకేజీతో నాకు సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తాను. సీపీ.. నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేసే దమ్ము నీకుందా?” అని సవాల్ విసిరారు. ‘‘నీ సంగతి తెల్వదా... ఖమ్మం, విజయవాడ, నల్గొండ సహా ఇతర జిల్లాల్లో ఏమేం చేశారో అన్నీ బయటకు తీస్తాం’’ అని సీపీని హెచ్చరించారు. సీపీ తీరుతో పోలీసులే తలదించుకుంటున్నారని అన్నారు. 

పోలీసులను కోర్టుకు ఈడుస్తా.. 

పోలీసుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. తన అత్తమ్మ దశదినకర్మ ఉందని చెప్పినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు. కనీసం నోటీసులూ ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్ల తీరుతో కింది స్థాయి సిబ్బంది తలదించుకునే దుస్థితి వచ్చింది. పోలీసులకు బలగం సినిమా చూపిస్తేనైనా బంధాల విలువ తెలుస్తుందేమో” అని అన్నారు. ‘‘నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నా ఇంటి మీద, నా మీద దాడి చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీకి కంప్లయింట్ చేస్తా. వరంగల్ సీపీపై కంటెప్ట్ వేస్తా. బాధ్యులందరినీ కోర్టుకు ఈడుస్తా. నన్ను బొమ్మలరామారంలో రిలీజ్ చేస్తే జైలుకు ఎందుకు పంపారు? నేను 2 వేల మందితో సెల్ఫీలు దిగుతా.. అంతమాత్రానా అందరితో లింకులున్నట్లేనా?’’ అని ప్రశ్నించారు.

కేటీఆర్ సీఎం అయితే హరీశ్ జంప్..  

తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రి హరీశ్ రావుపై హత్యానేరం కేసు పెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘1,400 మంది బలిదానాలకు కారకుడు హరీశ్ రావే. ఉద్యమం టైమ్ లో ఆయన పెట్రోల్ పోసుకొని రెచ్చగొట్టడం వల్లే వాళ్లు చనిపోయారు. కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీ నుంచి మొదట జంప్ అయ్యేది హరీశే. ఇంటర్ విద్యార్థుల మరణానికి కారకుడైన కేటీఆర్ పై పీడీ యాక్ట్ పెట్టాలి. దేశంలోని ప్రతిపక్షాలన్నింటికీ డబ్బులిస్తానని చెప్పిన కేసీఆర్ సంగతి తేల్చాలి. రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలపై ఎంక్వైరీ చేయించాలి” అని డిమాండ్ చేశారు. 

జైలు దగ్గర 144 సెక్షన్.. 

సంజయ్ విడుదల నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల నుంచే పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఐబీ చౌరస్తా,  గ్రేవ్ యార్డ్, వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టారు. జైలుకు 500 మీటర్ల  దూరంలోనే మీడియాను ఆపేశారు. జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడిన సంజయ్.. అనంతరం నేరుగా మహాశక్తి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి చేరుకొని తన అత్తమ్మ దశదినకర్మలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాల వేసి నివాళులర్పించారు. అప్పటికే భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు సంజయ్ ని గజమాలతో సన్మానించారు. అక్కడి నుంచి వారితో ఆయన ర్యాలీగా ఆర్టీసీ వర్క్ షాప్ వరకు నడిచారు. 

మోడీ సభను అడ్డుకుంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లే.. 

రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నప్పటికీ, సీఎం కేసీఆరే సహకరించడం లేదని సంజయ్ ఆరోపించారు. శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ‘‘సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే. 49 శాతం వాటా ఉన్న కేంద్రం ప్రైవేటీకరణ ఎలా చేయగలదు? కేంద్రం పేరు చెప్పి రాష్ట్రమే ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది” అని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ‘‘మోడీ వస్తున్నారని తెలిసి సింగరేణి కార్మికులను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ కుట్రలు చేశారు.  మోడీ సభను అడ్డుకుంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్లే” అని అన్నారు. కాగా, శుక్రవారం రాత్రి పరేడ్​ గ్రౌండ్​లో ప్రధాని సభ ఏర్పాట్లను సంజయ్​ పరిశీలించారు. 

ప్రశ్నిస్తే పిచ్చోడంటరా? 

30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఆయన కొడుకు, బిడ్డను జైలుకు పంపడం ఖాయమన్నారు. ‘‘జై తెలంగాణ అంటూ జెండా మోసినోళ్లంతా ఏమయ్యారు? దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం పాలన చేస్తోంది. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచకాలపై ప్రజలు విసుగెత్తిపోయారు. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు మరో ఉద్యమానికి సిద్ధమైనం.. కలిసి రండి” అని పిలుపునిచ్చారు. కేటీఆర్ కు అహంకారం తలకెక్కిందని.. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై ప్రశ్నిస్తే పిచ్చోడంటరా? అని ఫైర్ అయ్యారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలో వరంగల్​లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపడతామని తెలిపారు.