బంజారాల రిజర్వేషన్ ఏమాయె

బంజారాల రిజర్వేషన్ ఏమాయె
  • బంజారాలకు 10% ఇస్తనన్నవ్‌‌‌‌..రిజర్వేషన్లు ఏమాయె?
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ ప్రశ్న
  •     వాళ్లకూ గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్
  •     రాష్ట్రానికి వారి సేవలు అమూల్యం: దత్తాత్రేయ
  •     రాజధానిలో ఘనంగా బంజారా సంక్షేమ సభ

“కేసీఆర్ మాటలు కోటలు దాటుతై. కానీ హామీలు మాత్రం అస్సలు అమలు కావు. 10 శాతం రిజర్వేషన్లు ఇస్తమని ఎన్నికలప్పుడు గిరిజనులకు చెప్పిండు. ఎన్నికలైనంక వాళ్ల కళ్లల్ల మట్టి కొట్టిండు” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని బంజారా సమాజమంతా ఏకమై కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘గిరిజనులు సమాజంలో అత్యంత వెనుకబడ్డవాళ్లు. వాళ్లకు కూడా రూ.10 లక్షలిచ్చి గిరిజన బంధు అమలు చెయ్యాలె” అని డిమాండ్ చేశారు. సేవాలాల్ ఉత్సవ కమిటీ, స్వామి వివేకానంద సంఘం ఆధ్వర్యంలో బంజారా భాషా, సాంస్కృతిక సంక్షేమ సభ ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, ఈటల పాల్గొన్నారు. సభకు జిల్లాల నుంచి గిరిజనులు భారీగా వచ్చారు. లంబాడీ భాష, లిపి వేరైనా హిందూ సంస్కృతితో అవి విడదీయలేనంతగా ముడిపడే ఉన్నాయని ఈ సందర్భంగా సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని చెప్పారు. ‘‘లంబాడీ తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలు చేసిండు. కానీ నిధులిస్తలేడు. పోడు భూముల కోసం పోరాడుతున్నవాళ్లను జైల్లో పెడుతున్నరు” అంటూ మండిపడ్డారు. పోడు సమస్యపై బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు. లంబాడీల అభివృద్ధికి మోడీ సర్కారు ఎంతో పాటుపడుతోందని చెప్పారు. లంబాడీ తండాల్లో మహిళలకు ఇండ్లు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టిందని గుర్తు చేశారు. ‘‘బంజారాల దేవుడు సేవాలాల్ మహారాజ్ చరిత్ర చాలామందికి తెల్వదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి తండాలో ఆయన విగ్రహం పెడుతం’’ అని ప్రకటించారు. దళితులకు మూడెకరాలిస్తామని వాళ్ల కంట్లో కూడా కేసీఆర్ మట్టి కొట్టారని ఈటల మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దింపితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ‘‘గిరిజన విద్యార్థులకు పెండింగులో ఉన్న మెస్ చార్జీలు తక్షణం రిలీజ్ చేయాలి. తక్షణం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ మెయింటెనెన్స్ లో కేసీఆర్ సర్కారు ఫెయిల్యూర్ వల్ల పేద రైతులంతా ఇబ్బందులు పడుతున్నారని ఫైరయ్యారు.

బంజారా రేడియో బాగున్నది: దత్తాత్రేయ

బంజారాలు రాష్ట్రానికి అమూల్య సేవలందిస్తున్నారని దత్తాత్రేయ మెచ్చుకున్నారు. వారి భాష, సంస్కృతి అద్భుతమైనవన్నారు. టోరి గోరి బంజారా రేడియో, బంజారా యూట్యూబ్ చానల్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘‘బంజారా బిడ్డలు పెద్ద చదువులు చదువాలె.  పెద్ద ఉద్యోగాలు చెయ్యాలె.  గొప్ప మేధావులుగా, లీడర్లుగా ఎదగాలె” అని పిలుపునిచ్చారు. 

ఉమ్మడి నల్గొండలో నేడు, రేపు సంజయ్ టూర్

వడ్ల కల్లాలు, ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సంజయ్ రెండ్రోజుల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం)కు వెళ్తారు. అక్కడ్నుంచి మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లిల్లో రైతులను కలవనున్నారు. రాత్రి సూర్యాపేటలో ఉండి, మంగళ వారం తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటిస్తారు. మద్దతు ధర, వడ్ల  అమ్మకంలో రైతుల ఇబ్బందులను తెలుసుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో బీజేపీ మిలియన్ మార్చ్, రెండో దశ పాదయాత్ర వాయిదా పడింది.