ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగుతది

ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగుతది

బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయన్ను అరెస్టు చేయడంపట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా దీక్ష చేపట్టాలని ప్రయత్నిస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. అయితే.. వరంగల్ లో అరెస్టు చేసిన ఆయన్న ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. వరంగల్ లోని పామునూరు వద్ద అరెస్టు చేసిన అనంతరం కరీంనగర్ వైపుకు తరలిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ లేదా సిద్ధిపేట పీఎస్ కు తరలిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతానికి దూరంగా తరలించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

జనగామ జిల్లా పామునూరు దగ్గర బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న కవిత ఇంటి ముందు నిరసనకు వెళ్లిన కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ధర్మదీక్ష చేస్తానని సంజయ్ ప్రకటించడంతో పోలీసులు పాదయాత్ర శిబిరం దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి పోలీస్ వాహనాన్ని ఎక్కించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ వాహనం ముందుకు వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అడ్డు వచ్చిన వారిని ఈడ్చి పారేశారు.

మహిళా కార్యకర్తలను కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, 27న భద్రకాళి అమ్మవారి దేవాలయం దగ్గర ముగింపు ఉంటుందని... పాదయాత్ర ముగింపు సందర్భంగా 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. వెంటనే వాళ్లను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు బీజేపీ నేతలు. అరెస్ట్ సమయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని కార్యకర్తలు ఆరోపించారు